ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు? ఇసుక డిపో పెట్టారు... తీసేశారు ఎడ్ల బండ్లకు స్టాప్ బోర్డు ... కప్పం కట్టే ట్రాక్టర్లుకు ‘పచ్చ’ జెండా పచ్చ నేత అండ ... ఆగని ఇసుక అక్రమ దందా చర్యలేవని ప్రశ్నిస్తున్న ప్రజలు
మూన్నాళ్ల ముచ్చటగా ఉచిత ఇసుక డిపో
చీరాల అర్బన్: నియోజకవర్గంలో అధీకృత ఇసుక రీచ్‌లు లేవు. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉచిత ఇసుక ఊసే లేదుకానీ, పచ్చనేత అండతో అక్రమ ఇసుక దందా ఆగడం లేదు. ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కప్పం చెల్లిస్తేనే రైట్ రైట్..
ఉచిత ఇసుక డిపో ఏర్పాటు చేసిన కొత్తలో ఎడ్ల బండ్ల యజమానులు ఇసుక తోలకాలతో కొంత మేర ఉపాధి పొందేవారు. ఈక్రమంలో అక్రమ దందా ఆపేందుకు అని ఇసుక డిపోను కొద్దిరోజులు మూసేశారు. ఎడ్ల బండ్లకు చెక్ చెప్పారు. కప్పం చెల్లించే ట్రాక్టర్లకు పచ్చజెండా ఊపారు. అందుకు ఆర్థికపరమైన వ్యక్తిగత ప్రయోజనాలు పని చేశాయన్నది బహిరంగ రహస్యం. జిల్లాలో కొల్లూరు, జువ్వెలదిన్నెలలో మాత్రమే అధీకృత ఇసుక రీచ్‌లు ఉన్నాయి. కానీ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఇంతజరుగుతున్నా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
సొంతింటి నిర్మాణాలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి
వాస్తవానికి సొంతిల్లు నిర్మాణానికి సంబంధించి ఆ ప్రాంత తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకుని ఎడ్ల బండ్లు లేదా ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించుకోవచ్చు. అయితే అక్రమార్కుల ఆధీనంలో ఇసుక వ్యవస్థ బందీ అయ్యింది. దీంతో సొంతింటి అవసరాలకు కూడా ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చీరాల నియోజకవర్గం ప్రభుత్వం ప్రకటించిన అఽధీకృత ఇసుక రీచ్‌ల జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో 2024 జూలై మొదటి వారంలో వేటపాలెం మండలం నాయినిపల్లి పరిధిలో ప్రభుత్వ ఉచిత ఇసుక డిపోను ఏర్పాటు చేశారు. రీచ్‌లు ఉన్న ప్రాంతాల నుంచి ఇసుకను డంప్ చేశారు. ఏమైందో ఏమో కానీ అది మూన్నాళ్ల ముచ్చటయ్యింది. కొద్ది రోజులకే డిపోను తీసేశారు.


