బాగా చదివితే బంగారు భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

బాగా చదివితే బంగారు భవిష్యత్తు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

బాగా చదివితే బంగారు భవిష్యత్తు

బాపట్ల: బాగా చదివితే మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ విద్యార్థులతో అన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో జిల్లా కలెక్టర్‌ శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రద్ధతో చదువుకుంటే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని, అందుకు ప్రభుత్వం అండగా నిలిస్తుందని కలెక్టర్‌ చెప్పారు. చీరాలకు చెందిన ఊటుకూరి లీలాలక్ష్మీ, ఊటుకూరి లక్ష్మీనారాయణ, వేమూరికి చెందిన చైత్ర సాహితీ దాస్‌, సాయి ప్రీతమ్‌ లకు ప్రభుత్వమే ఉచితంగా విద్య అందిస్తుందన్నారు. ఇద్దరు తెనాలిలో, మరో ఇద్దరు తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన కాలేజీ బ్యాగ్స్‌, ట్రాలీ బ్యాగ్స్‌ లు తక్షణమే ఇస్తామన్నారు. స్టడీ చైర్‌, స్టడీ టేబుల్‌ కావాలని చైత్ర సాహితీదాస్‌ కోరడంతో తక్షణమే ఇప్పించాలని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ ఖాతా నుంచి వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాలని పీడీకి సూచించారు. ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి ఒక్కో ల్యాప్‌టాప్‌ ఇస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం చదువులు, వారి యోగక్షేమాలను అడిగి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియం చేసుకుని, మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, డీసీపీఓ పురుషోత్తం, ఎన్‌ఐసీ పీఓ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

వేతనాల సమస్యకు పరిష్కారం..

కారుణ్య నియామకం కింద నియమితులైన ఇరువురు ఉద్యోగుల వేతనాల సమస్యను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ పరిష్కరించారు. 2024లో కారుణ్య నియామకం కింద ఇరువురు ఉద్యోగాలు పొందారు. కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ ఆడిట్‌ టీం లో జూనియర్‌ అసిస్టెంట్‌ గా పి.వి.సందీప్‌, లీగల్‌ సెల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా రాజ్యలక్ష్మి నియమితులయ్యారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 18 నెలల నుంచి వీరికి వేతనాలు విడుదల కాలేదు. కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌ తక్షణమే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు, సాంకేతిక సమస్యలను పరిశీలించి వేతనాలు విడుదల చేశారు. దీంతో వారిరువురు శనివారం కలెక్టర్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందించి, కృతజ్ఞతలు తెలిపారు.

సూర్యలంక పనుల పరిశీలన..

సూర్యలంక సముద్రతీరంలో జరుగుతున్న పనులను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజులు శనివారం పరిశీలించారు. అధికారులు పనుల పర్యవేక్షణలో శ్రద్ధ చూపించాలని సూచించారు. వారివెంట బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, జిల్లా ఇన్‌చార్జి పర్యాటక శాఖ అధికారి ఆనందపాల్‌, ఏపీటీడీసీ మేనేజర్‌ సతీష్‌, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ రాజన్‌ బాబు, గ్రామీణ నీటి సారాఫరా శాఖ ఎస్‌ఈ అనంత రాజు, డీఎఫ్‌ఓ రవిశంకర్‌ తదితరులు ఉన్నారు.

కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement