పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం, హేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాధరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనురాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధరతిలక్ పర్యవేక్షించారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పలు యూజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు శనివారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఏ, బీబీఏ, ఐదవ సెమిస్టర్, బీకాం జనరల్, కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించామన్నారు. ఈనెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్‌కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగ డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు మురళి, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వినుకొండ: మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. వినుకొండకు చెందిన ఓ మహిళపై లైంగికదాడితోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను శనివారం సస్పెండ్ చేశారు. కేసు నమోదు నేపథ్యంలో సీఐ పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఏ క్షణమైన ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
నగరంపాలెం: పోలీస్ విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (హెచ్‌సీ), ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌న్ హెచ్‌సీ ఏవీ.రమణ, కానిస్టేబుల్ సీహెచ్.రాము, తెనాలి గ్రామీణ పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ చెంగల రాయుడుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని చెప్పారు. అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, విధుల దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గీత దాటితే శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.


