స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి అమ్మవారు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

అమ్మవారికి ప్రాచీన ఆభరణాలతో అలంకరణ పోటెత్తిన భక్తులు

బాపట్ల: ప్రసిద్ధిగాంచిన చందోలులోని బగళాముఖి అమ్మవారు స్వర్ణ ప్రకాశ రూపిణిగా దర్శనమిచ్చారు. దివ్యక్షేత్రం వార్షిక ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రాచీన స్వర్ణ ఆభరణాల శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆభరణాలను అమ్మవారికి అలంకరింపజేశారు. అమ్మవారిని దర్శించడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేశారు. తొలుత ఆలయం నుంచి దేవాదాయ, పోలీస్‌, రెవెన్యూ పంచాయతీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చందోలు స్టేట్‌ బ్యాంకు వద్దకు శోభాయాత్రగా చేరుకొనగా బ్యాంక్‌ మేనేజర్‌కు అనుమతి లెటర్‌ ఇచ్చి అందరూ సంతకాలు చేసి బ్యాంకు నుంచి సీల్డు నగలు బాక్స్‌ను స్వీకరించి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకొని అందులో ఉన్న ఆభరణాలను అధికారుల సమక్షంలో అమ్మవారి అలంకారం నిమిత్తం ఆలయ పూజారులకు అప్పగించారు. అప్పటి నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు కొనకాల బుల్లిబాబు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరికీ చల్లటి మజ్జిగ అందజేశారు.

ప్రముఖుల సందర్శన

స్వర్ణాభరణముల అలంకారంలో అమ్మవారిని దర్శించటానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి సుజాత, పెనుగొండ వాసవి పీఠాధిపతులు పరమ శ్రీప్రజ్ఞ భారతిస్వామి, బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్‌, బాపట్ల డీఆర్‌ఓ జి గంగాధర్‌గౌడ్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

పంచలోహ సింహాలు వితరణ

బాపట్ల శాసనసభ్యులు వేగేశ న నరేంద్ర వర్మ రాజు కుటుంబ సమేతంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. రూ.9 లక్షల వెచ్చించి తయారు చేయించిన గ్రానైట్‌ రాతి పద్మ పీఠం, పంచలోహ సింహాలను అమ్మవారి ఆలయానికి సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్‌ ఎం భాగ్యలక్ష్మి, తహసీల్దార్‌ డి వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ ఎంవీ శివకుమార్‌, పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ బి సుజాత, వీఆర్‌ఓ అరుణకుమారి, ఆలపాటి వెంకటరమణారావు, భవనం బసవరెడ్డి, దోమ నాగేశ్వరరెడ్డి, కేతరాజు, పట్టాభిరామారావు ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కలకోట చక్రధర్‌రెడ్డి సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్‌, అయినంపూడి వెంకట పద్మజ, నక్క సముద్రాలు, ఎనకపల్లి వెంకటప్పయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement