ఇదేం రీల్స్‌ పిచ్చి! | - | Sakshi
Sakshi News home page

ఇదేం రీల్స్‌ పిచ్చి!

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

విధులు మరిచి రీల్స్‌ చేస్తున్న జీజీహెచ్‌ వైద్యులు రోగుల సేవల్లో ఉండాల్సిన వైద్యులు సోషల్‌ మీడియా రీల్స్‌లో మునిగి తేలుతున్న వైనం వైద్యుడి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

గుంటూరు మెడికల్‌: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్‌ సోషల్‌ మీడియా రీల్స్‌కు అడ్డాగా మారింది. రోగులకు సేవలందించాల్సిన ఓ వైద్యుడు సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. కర్రతో విన్యాసాలు చేస్తూ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట రీల్స్‌ చేసి వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టడంతోపాటు, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో సైతం అప్‌లోడు చేశాడు. సాక్షాత్తు సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుటే డాక్టర్‌ రీల్స్‌ చేస్తున్నా సూపరింటెండెంట్‌ గానీ, సీఎస్‌ ఆర్‌ఎంఓగానీ, అడ్మినిస్ట్రేటర్‌ గానీ ఎవరూ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది.

విధులకు డుమ్మా.. రీల్స్‌తో హంగామా

జీజీహెచ్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) గా క్యాజువాల్టీ మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ గురుప్రసాద్‌ శుక్రవారం క్యాజువాల్టీలో విధులు నిర్వహించకుండా సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట రీల్స్‌ చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జీజీహెచ్‌లో క్యాజువాల్టీ ఆసుపత్రికి గుండెకాయలాంటిది. రోడ్డు ప్రమాద బాధితులు, విషప్రభావానికి గురైన వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో అత్యవసర చికిత్సల కోసం వచ్చేవారంతా కూడా మొదట ఎమర్జెన్సీ వార్డుకు చికిత్స కోసం వస్తుంటారు. అక్కడ వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండి బాధితులను రోగులను సత్వరమే పరీక్షించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. ఎంతో కీలకమైన క్యాజువాల్టీలో డాక్టర్‌ విధులు నిర్వహించకుండా రీల్స్‌ చేయడంపై ప్రశ్నించినందుకు ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇన్‌చార్జి, ఆర్ధోపెడిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ అనిల్‌బాబుతో సైతం దురుసుగా మాట్లాడి కర్రతో దాడిచేసినట్లు డాక్టర్‌ అనిల్‌బాబు లిఖిత పూర్వకంగా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు.

గతంలోనూ ఆరోపణలు..

గతంలోనూ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో విధులు నిర్వహించడం లేదని, డ్యూటీలు నిర్వహించకుండా రీల్స్‌ చేస్తున్నారన్న ఆరోపణలు డాక్టర్‌ గురుప్రసాద్‌పై వచ్చాయి. అతడిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన డాక్టర్‌ గాజుల రామకృష్ణ సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు సదరు వైద్యుడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ నేడు ఆవిధంగా రీల్స్‌ చేస్తూ ఆసుపత్రి పరువు బజారున పడేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో వైద్యులు ఇలా సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేయడం విమర్శలకు తావిస్తుంది. జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌వర్మ సంఘటనపై స్పందించి ఎమర్జెన్సీ వార్డులో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేలా వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని, రీల్స్‌ చేయకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement