బాపట్ల: పదవ తరగతి ఫలితాల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ హాల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువా కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం రెండున్నర శాతం పెరిగిందని పేర్కొన్నారు. విద్యార్థుల మార్కులు కేవలం గుర్తింపుకే పరిమితమని, జీవితంలో విజయానికి మార్కులే ప్రమాణం కాదని కలెక్టర్ అన్నారు. చదువుపై ఆరోగ్యకరమైన పోటీ, క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలతో పాటు జీవితంలో కూడా విజయాన్ని సాధించవచ్చని సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరుత్సాహపడకూడదని, తల్లిదండ్రులు ఒత్తిడి చేయవద్దని చెప్పారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని మీ ఊరు, ప్రాంతం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల హెచ్‌ఎంలను, ఎంఈఓలను అభినందించారు. ఈ సందర్భంగా కొల్లూరు జెడ్పీ బాలికల హైస్కూల్‌కు చెందిన బావిరెడ్డి దివ్య తేజశ్రీ 596 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించగా, సత్కరించారు. వేటపాలెం జెడ్పీహెచ్‌ఎస్ పందిళ్లపల్లి చెందిన ఎడవల్లి తేజస్వి (593), గద్దె బంధవ్య (592), సంతమాగులూరు మండలం మెక్కనవారిపాలెం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన చదలవాడ సాయి రామ్ ధీరాజ్ (586), చెరుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన షేక్ షాహుల్ హామీద్ (585), పందిలపల్లి చెందిన గుంటూరు హర్ష (585)ను అభినందించారు.


