చేబ్రోలు: విద్యాసంస్థల్లోని ల్యాబ్‌లకు ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని బెంగళూరుకు చెందిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణుడు డాక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్‌పై అవగాహన సదస్సు’ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారెడ్డి ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ ప్రాముఖ్యత, డాక్యుమెంటేషన్ విధానం, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అక్రిడిటేషన్ పొందడానికి ల్యాబ్‌లు కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక పరీక్ష విధానాలు, సమగ్ర రికార్డుల నిర్వహణ, సాంకేతిక ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. ల్యాబ్ క్వాలిటీ మాన్యువల్ తయారీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించడం, టెస్టింగ్ మరియు కాలిబ్రేషన్ రికార్డుల నిర్వహణ, ఇంటర్నల్ ఆడిట్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఎన్‌ఏబీఎల్ ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణ వంటి ముఖ్య అంశాలను అధ్యాపకులకు వివరించారు. విద్యాసంస్థల్లోని ల్యాబ్‌లకు ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ కలిగి ఉండటం వలన పరీక్షా ఫలితాలపై విశ్వసనీయత పెరగడమే కాకుండా, ఇండస్ట్రీ మరియు పరిశోధన రంగాల్లో అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఎన్‌ఏబీఎల్–క్యూసీఐ కో ఆర్డినేటర్ మానసి కులకర్ణి ‘గుణవత్తా యాత్ర’ కార్యక్రమం, క్వాలిటీ ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.
తెనాలి: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్ తిరుపతిలో ఏటా నిర్వహించే గరుడ నాటక పోటీలకు తెనాలి నుంచి రెండు నాటికలు ఎంపికయ్యాయి. సాంఘిక నాటికల విభాగంలో అద్దేపల్లి–ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘ఎవరు’ నాటిక, బాలల పద్యనాటక విభాగంలో బృందా అవ్యాన్ ఆర్ట్స్ శ్రీసరస్వతి శిశుమందిర్, తెనాలి వారి ‘వైకుంఠం’ నాటిక ఎంపికయ్యాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే పోటీల్లో మే నెల 22వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఎవరు నాటిక, 8.30 గంటలకు వైకుంఠం పద్యనాటిక ప్రదర్శనకు అవకాశం కల్పించినట్టు సంబంధిత కమిటీ కార్యదర్శి గజేంద్ర సమాచారం పంపినట్టు నాటికల నిర్వాహకుడు ఆరాధ్యుల కన్నా బుధవారం సాయంత్రం తెలిపారు. రెండు నాటికలను పట్టణానికి చెందిన యువనర్తకి, నాట్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించగా, నటుడు, దర్శకుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శిస్తారని తెలిపారు. సహకరించిన సుల్తానాబాద్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ ఫౌండర్ సెక్రటరీ కోడూరు రమాదేవి, శిశుమందిర్ అధ్యక్షులు అవ్వారు లత, హెచ్‌ఎం వలివేటి రాజేంద్ర కుమార్, యర్రంశెట్టి హనుమంతరావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక సమాజాల నిర్వాహకులు తేజస్వి ప్రఖ్య, లక్ష్మణశాస్త్రిని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి, షేక్ జానీబాష, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్ అండ్ బీ రాజు, బద్దుల తిరుమలయ్య, హార్మోనిస్టు యోహాను, ఫ్రాన్సిస్, పరిశుద్ధరావు తదితర కళాకారులు అభినందించారు.
బీఈడీ పరీక్షలలో అక్రమాలపై విచారణ జరపాలి
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గౌరవ అధ్యక్షుడు పంతగాని రమేష్
ఏఎన్‌యూ (పెదకాకాని): బీఈడీ పరీక్షల్లో అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని ఏఎన్‌యూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గౌరవ అధ్యక్షుడు పంతగాని రమేష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్సిటీ పరిధిలో జరుగుతున్న బీఈడీ నాలుగో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను కొందరు అధికారులు రూ.లక్షల వ్యాపారంగా మర్చారని ఆరోపించారు. థియరీ పరీక్షలలోను ఒకరి బదులు మరొక రాయించటం, కాపీయింగ్ చేయించడం దారుణమన్నారు. అమరావతిలోని కళాశాలకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండ కళాశాలను కేంద్రంగా కేటాయించటం, వినుకొండ నరసరావుపేటలోని ఒకే యాజమాన్యానికి చెందిన కళాశాలను సెంటర్లుగా కేటాయించడం, గతంలో బీఈడీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారి కళాశాలలకు సెంటర్లను కేటాయించటం, ఆరు బీఈడీ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేయటం ద్వారా వర్సిటీ అక్రమాలకు తెరతీసిందన్నారు. నరసరావుపేట, వినుకొండతో పాటు పల్నాడులోని మరో రెండు సెంటర్లలో కాపీయింగ్ చేయించారని ఆయన ఆరోపించారు.


