చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి మామిడాల వెంకయ్య–సీతారావమ్మ కళావేదికపై స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి శ్రీమాత్రేనమః అనే నాటికను ప్రదర్శించారు. ప్రియుడి కంటే బిడ్డ మీదే తల్లికుండే ప్రేమ అజేయమని చాటే శ్రీమాత్రేమనః నాటిక ప్రేక్షకులను ఆధ్యంతం ఆలోచింపచేసింది. నాటికకు రచన, దర్శకత్వం ఉదయ్ భాగవతుల వ్యవహించారు. అనంతరం చీరాల కళాంజలి వారి పుటుక్కు జరజర డుబుక్కుమే నాటికను ప్రదర్శించారు. అరువు సొమ్ము బరువు చేటు అనే సందేశంతో నాటిక హాస్య చమత్కార సంభాషణలతో సాగింది. నాటికకు రచన దివాకర్‌బాబు, దర్శకత్వం పూర్ణా సత్యం వ్యవహరించారు. నాటికలోని పాత్రధారులు ఆ పాత్రలకు నటనతో జీవం పోశారు. అనంతరం నాటికల్లోని నటీనటులను, రచయిత, దర్శకత్వం వహించిన వారికి చీరాల ఎన్‌ఆర్‌పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రదర్శనా పారితోషకాన్ని అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తెలిపారు.
– ఆకట్టుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు


