ఉపాధ్యాయుడిని వదిలేసి హెచ్‌ఎంకు నోటీసు తగదు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిని వదిలేసి హెచ్‌ఎంకు నోటీసు తగదు

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌ ఆరు నెలలుగా పాఠశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయుడిని వదిలేసి, తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్న ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడం తగదని అఖిల భారత సెకండరీ ఉపాధ్యాయుల సంఘ (ఏఐఎస్టీఎఫ్‌) ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషాను డీఈవో కార్యాలయంలో ఎస్టీయూ నాయకులతో కలసిన జోసఫ్‌ సుధీర్‌బాబు ఉపాధ్యాయుడితో పాటు అతనికి సహకరించిన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ గుంటూరు తూర్పు పరిధిలోని గోరంట్ల ఎంపీపీ (ఎల్‌ఈ) స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు గత ఆర్నెల్లుగా విధులకు గైర్హాజరైన విషయాన్ని ఇటీవల ఒక ప్రధాన దినపత్రిక వెలుగులోకి తెచ్చేవరకూ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎంకు వాట్సాప్‌ ద్వారా సెలవు సమాచారాన్ని పంపి, లీప్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేస్తున్న విషయం సంబంధిత ఎంఈవోకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రముఖ పత్రికలో కథనం వచ్చిన తరువాత నిద్ర మేల్కొన్న ఎంఈవో... ఉపాధ్యాయుడిని వదిలి, విధులకు సక్రమంగా హాజరవుతున్న ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం, పైగా దివ్యాంగురాలికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ బాజీ, వై.శ్యాంబాబు ఉన్నారు.

గోరంట్ల పాఠశాల వ్యవహారంపై విచారణ

గుంటూరు ఎడ్యుకేషన్‌ గోరంట్లలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఈ)లో బుధవారం విద్యాశాఖాధికారులు విచారణ నిర్వహించారు. ఆర్నెల్లుగా ఉపాధ్యాయుడు గైర్హాజరుకావడం, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు జారీ వెనుక వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం, ఎంఈవో విజయభాస్కర్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం రాజకుమారి వాంగ్మూలం నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement