ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలేవీ?

Apr 30 2026 7:49 AM | Updated on Apr 30 2026 7:49 AM

నయనానందకరం.. కల్యాణోత్సవం నృసింహునికి లక్ష పుష్పార్చన వైభవంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ట మహోత్సవం అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం రూ.ఐదు కోట్ల విలువైన సాగు భూమి స్వాధీనం

న్యూస్‌రీల్‌

ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం..

నయనానందకరం.. కల్యాణోత్సవం

తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన వైనం

త్రుటిలో తప్పించుకున్న కన్నవారు

ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్‌ శ్రీనివాస్‌ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు.

మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

తెనాలిరూరల్‌: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్‌ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్‌ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది.

యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువైన శ్రీభూ సమేత రంగనాయకస్వామి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుడు పరుచూరి రామకృష్ణ చార్యుల నేతృత్వంలో మూలవిరాట్‌లతో పాటు నవవధువరులుగా ఉత్సవ మూర్తులను విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ, బిందతీర్థం, నిత్యార్చన, హోమ, గ్రామబలిహరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ అమ్మవారికి నిర్వహించిన సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా రాత్రివేళ స్వామివారి ఉత్సవమూర్తిని భారీ విద్యుత్‌ అలంకరణ చేసిన హనుమత్‌ వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్‌ –నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

బాపట్ల: మహిళల పట్ల ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఈనెల 9వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్‌లతోపాటు జిల్లా కేంద్రంలో ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవటం బాధకరమన్నారు. ఈమేరకు ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవటంపై పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, రేపల్లె సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణలతో బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వరికూటి మాట్లాడుతూ మహిళలను అగౌరపరిచేవిధంగా మాట్లాడిన వేమూరి రాధాకృష్ణను అరెస్టు చేయకుండా ప్రశ్నించిన తమ నాయకులపై కేసులు కట్టడం ఏమేరకు న్యాయమో అర్ధంకావటంలేదన్నారు. ఇప్పటికై న పోలీసులు తమ తీరును మార్చుకోవాలని, లేకుండే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. పెట్రోలు, డీజిల్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేయగా వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకోవటం పరిస్థితి సాధారణస్థితికి వచ్చిందని వరికూటి పేర్కొన్నారు. బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే ఆందోళన చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మరుసటిరోజే డీజిల్‌, పెట్రోల్‌లు సాధారణ స్థితికి వచ్చాయన్నారు.

అనైతిక రాజకీయాలు చేయటం మానుకోవాలి..

మహిళలను అగౌరపరిచేవిధంగా మాట్లాడిన రాధాకృష్ణను అరెస్టు చేయకుండా ఆయనపై ఫిర్యాదు చేసిన వారిన్ని అరెస్టులు చేసి బెదింపులకు దిగటం ఏవిధమైన న్యాయమో పోలీసులు చెప్పాలని వైఎస్సార్‌ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలు చేయటంలో తప్పులేదని, అనైతిక రాజకీయాలు మంచిపద్ధతి కాదని ఆయన సూచించారు.

కన్నకూతురు ఘాతుకం

చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్‌ నుంచి లోపలికి పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు.

ఆక్వాకల్చర్‌ పార్క్‌ వేగవంతం చేయాలి

బాపట్ల: జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాకల్చర్‌ పార్క్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్క్‌ ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాకల్చర్‌ ద్వారా చేపలు, రొయ్యలు, ఇతర జలవనరుల ఉత్పత్తిని సమగ్రంగా పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈపురుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ వద్ద నిర్మిస్తున్న జెట్టి పనులు, నిజాంపట్నం మండలం కొత్తపాలెం గుండి సముద్రం వద్ద చేపడుతున్న పనులను నిర్దిష్ట టైమ్‌ బౌండ్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. మత్స్యశాఖ ఏడీ గాలిదేవుడుతో పాటు ఈడబ్ల్యూడీసీ అధికారులు, ఏపీ మానిటరింగ్‌ బోర్డు అధికారులు పాల్గొన్నారు.

అందుబాటులో జనరిక్‌ మెడిసిన్‌..

బాపట్ల: ప్రధాన మంత్రి భారతీయ జనఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్‌ ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, బాపట్ల వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రెడ్‌ క్రాస్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి భారతీయ జనఔషధ కేంద్రం (మెడికల్‌ – సర్జికల్‌ స్టోర్స్‌) ను జిల్లా కలెక్టర్‌, బాపట్ల జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ ప్రారంభించారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.ఎస్‌.నారాయణ భట్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, ఆర్డీఓ.పి.గ్లోరియా, మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘునాధ్‌ రెడ్డి, బాపట్ల తహసీల్దార్‌ సలీమా, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

● ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో ప్రతివారం పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఆర్‌అండ్‌బీ, సూర్యఘర్‌, సీఎండీఎఫ్‌, ఎంపీ లాడ్స్‌ నిధులతో చేపట్టిన పనుల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు.

● జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంలో ఎలాంటి లోపాలు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో నిధుల వినియోగం, పనుల పురోగతిపై సమీక్ష చేపట్టి, అర్హులైన లబ్ధిదారులకు వంద శాతం ప్రయోజనం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

● జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. న్యూ వీసీ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ సహా పలు శాఖల పనులను సమీక్షించారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ఆటిజం సహాయ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తలు

వరికూటి అశోక్‌బాబు, గాదె మధుసూదన

రెడ్డి, పీటా నాగమోహన్‌కృష్ణ

జిల్లా ఎస్పీ కార్యాలయంలో

మళ్లీ ఫిర్యాదు చేసిన నేతలు

రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌ పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారేగానీ, ఫిర్యాదు చేసిన వారికి న్యాయం చేయాలని పోలీసులకు తెలియకపోవటం బాధకరమన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement