బెట్టింగ్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ మాఫియా

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

బెట్టింగ్‌ మాఫియా

చీరాల్లోనే పెద్ద బుకీలు.. ఏజెంట్లు ..

ఐపీఎల్‌ క్రికెట్‌ అభిమానుల ఆసక్తిపై బుకీల వల కోడ్‌ లాంగ్వేజ్‌తో బెట్టింగ్‌ జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేసిన పోలీసులు పెద్ద చేపలను తప్పుకోగా.. వలలో పడిన చిన్న చేపలు ? కొందరికి స్టేషన్‌ బెయిల్‌.. మరికొందరికి రిమాండ్‌?

చేజారిపోతున్న పెద్ద చేపలు..

చీరాల: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌ క్రికెట్‌ పోటీలు ఉత్కంఠ.. ఉద్వేగంతో సాగుతున్నాయి. వేసవిలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూస్తూ క్రికెట్‌ అభిమానులు ఎంజాయ్‌ చేస్తుంటే క్రికెట్‌ అభిమానులను బెట్టింగ్‌ల పేరుతో క్రికెట్‌ బుకీలు తమ బుట్టలో వేసుకుంటున్నారు. రెండు నెలల పాటు జరిగే మొత్తం 74 మ్యాచ్‌లు ఆరంభం నుంచే మంచి హీటెక్కిస్తున్నాయి. బెట్టింగ్‌ కాసేవారు మాత్రం క్రికెట్‌ అభిమానులను బెట్టింగ్‌ ఆశ చూపి రొంపులోకి దించుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ బుకీలను పెద్ద సంఖ్యలో సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను పట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌..

చీరాల్లో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌ కారణంగా చేతులు మారుతున్నాయి. ఇందుకు వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బడా బుకీలుగా ఏజెంట్లు బెట్టింగ్‌లను నడుపుతున్నారు. గతంలో ఒకే చోటు కూర్చొని బెట్టింగ్‌లు జరుగుతుంటే పోలీసులు నిఘా పెట్టి పట్టుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బెట్టింగ్‌ బాబులు రూటు మార్చారు. ఆన్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి టీవీలో ఒక బంతికంటే ముందుగానే వచ్చే సమాచారాన్ని చూస్తూ ఫోన్ల ద్వారానే బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు పందేలు కాస్తున్నారు. బంతి బంతికి, ఓవర్‌ ఓవర్లుకు బెట్టింగ్‌ కాయిస్తున్నారు. బ్యాటింగ్‌ సరళిని బట్టి అప్పటికప్పుడు బెట్టింగ్‌ మార్చడంతో సులువుగా సంపాదించుకునే ఉద్దేశంతో చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్‌తో చితికిపోతున్నారు. గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా తీవ్ర అప్పులపాలై అప్పులు తిరిగి చెల్లించలేక మానసిక వేదనతో పలువురు బలవణ్మరణాలకు పాల్పడ్డారు. బెట్టంగ్‌లకు డబ్బులు చెల్లించలేక దొంగతనాలకు పాల్పడటంతో పాటు గతంలో ఈపురుపాలెం, దేవాంగపురి గ్రామాల్లో బెట్టింగ్‌ అప్పులు చెల్లించలేక ఇరువురు యువకులు ఊరు వదలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.

ఆట సరళిని బట్టి..

బెట్టింగ్‌ రాయుళ్లు తమకు అనువుగా మ్యాచ్‌లను మార్చుకుంటున్నారు. టీవీలు చూస్తూ ఓవర్‌లో ఎన్ని రన్స్‌ కొడతారు.. ఈ బంతి సిక్స్‌.. ఫోర్‌.. డబుల్‌ రన్‌.. ఈ ఓవర్‌లో వికెట్‌ పడుతుందంటూ బెట్టింగ్‌లు కడుతున్నారు. టీవీల వద్ద వ్యక్తిగతంగా పందేలు కాస్తున్నారు. బుకీ ఏజెంట్లు మాత్రం యువకులు, వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు లక్షలాది రూపాయలు బుకీల ద్వారా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్‌ వ్యవహారం అంతా కోడ్‌ లాంగ్వేజ్‌ ద్వారా సాగిస్తున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారా బుకీలతో మాట్లాడుతూ ‘‘ఈటింగ్‌.. ఎస్‌.... నో ..’’ వంటి పదాలు వాడుతున్నారు. కొత్తవారైతే ముందుగా డబ్బులు డిపాజిట్‌ చేయించుకుంటారు. ఎప్పటి నుంచి బుకీలతో సస్సంబంధాలు ఉన్నవారికి మాత్రం అరువు కూడా ఇస్తుంటారు. బెట్టింగ్‌లో పోతే రూ.5వేలు.. గెలిస్తే రూ.20 వేలు ఇలా క్రికెట్‌ అభిమానులను డబ్బు ఆశ చూపుతున్నారు. గెలిచిన డబ్బులను మరుసటి రోజునే వారికి ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా జమ చేస్తున్నారు. ఒకప్పుడు టీవీల్లో చూస్తూ పందేలు కాస్తుండేవారు. అయితే ప్రస్తుతం అంతా సెల్‌ఫోన్‌లో చూస్తూనే పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ బెట్టింగ్‌లలో ఎక్కువగా బుక్‌ అవుతున్నారు.

చితుకుతున్న కుటుంబాలు..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతం గ్రామాలకు పాకింది. ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో ఎంతో మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. పోయిన డబ్బు కట్టేందుకు అప్పులపాలవుతున్నారు. చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్నా, మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఊరు వదిలివేళ్ళిపోతున్నారు. బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు వడ్డీతో సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు చేసే ఇబ్బందులు తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నారు. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చాప కిందనీరు వస్తున్న బెట్టింగ్‌ భూతాన్ని పోలీసులు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.

రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు ఽఅధికంగా ఉండే చీరాల్లో క్రికెట్‌ బుకీలు, ఏజెంట్లకు కొదవ లేదు. చీరాల నియోజకవర్గంలో పేరు మోసిన బుకీలు, ఏజెంట్లు లక్షలు సంపాదిస్తూ పేదల రక్తాన్ని తాగుతున్నారు. చీరాల నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో బుకీలున్నారు. జాండ్రపేటలో ఇద్దరు, వేటపాలెంలో ఇద్దరు, ఈపూరుపాలెంలో ఇద్దరు ఏజెంట్లు, చీరాల ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్‌లను నడుపుతున్నారు. ఎప్పటికికప్పుడు పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు లావాదేవీలంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఫలితాన్ని బట్టి డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకంలేనివారి వద్ద ముందే డబ్బు డిపాజిట్‌ చేసుకుంటున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌లలో ఆరితేరిన పెద్ద బుకీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పటి నుంచే ఇదే తరహాలో తెరవెనుక బెట్టింగ్‌లు చేస్తూ పెద్ద మొత్తం ఆదాయాన్ని గడించారు. ఐపీఎల్‌ సీజన్‌లో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ బుకీలపై పోలీసులు నిఘా ఉంచారు. సీసీఎస్‌ పోలీసులు ఇటీవల జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా క్రికెట్‌ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. చీరాల టూటౌన్‌, వేటపాలెం, చెరుకుపల్లి, బాపట్ల, రేపల్లె, కర్లపాలెం పోలీస్‌స్టేషన్లలో వీరిని ఉంచారు. పోలీసులు మాత్రం జిల్లాలో 42 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 37 మంది చీరాల నియోజకవర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. వీరి నుంచి కారు, బైక్‌, 25 సెల్‌ ఫోన్లు, రూ.51,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉన్న వారు కూడా ఉన్నారు. వేటపాలెం మండలంలో 25మందిని అదుపులోకి తీసుకోగా వారిలో నలుగురు పరారీలో ఉన్నారు. వారం రోజుల కిందట అదుపులోకి తీసుకుంటే పరారీలో ఎలా ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. మరికొందరికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో నేతల ‘పలుకు’బడి బాగా పనిచేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement