వెంటాడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత | - | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరత

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

రేపల్లెలో నాలుగవ రోజు కూడా అందని ఇంధనం పట్టణంలోని ఐదు బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు ఇంధనం కొరత లేదంటున్న అధికారులు వాహనదారుల కు తీవ్ర ఇబ్బందులు

రేపల్లె: పట్టణంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నాలుగవ రోజు కూడా సమస్య కొనసాగింది. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న ఐదు పెట్రోల్‌ బంకుల్లో మంగళవారం ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఉదయం రెండు గంటలపాటు పలు బంకులలో పెట్రోలు, డీజిల్‌ సరఫరా చేసినా తర్వాత స్టాక్‌ అయిపోయిందంటూ వాహన చోదకులను తిప్పి పంపించేశారు. ఇంధన కొరతతో రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వ్యవసాయ పనులు సాగుతున్న ఈ సమయంలో డీజిల్‌ లభ్యం కాకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇదిలా ఉండగా, జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఇంధనం కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు రేపల్లెలో భిన్నంగా ఉన్నాయి. దీంతో వాహన చోదకులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం కోసం సమీప పట్టణాలకు వెళ్లాల్సి రావడంతో అదనపు ఖర్చు, సమయం వృథా అవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, బంకులకు సరిపడా ఇంధనం సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

వేమూరు నియోజకవర్గంలో...

వేమూరు: నియోజక వర్గంలోని 20 బంకులు ఉన్నాయి. అమృతలూరు మండలంలోని కూచిపూడి, పెదపూడి, అమృతలూరు, గోవాడ ఇంటూరు గ్రామాల్లో బంకులు ఉండగా.. పెదపూడి, గోవాడ గ్రామాల్లో బంకులు మూసేశారు. వేమూరు మండలంలోని జంపని, వేమూరు, చావలి గ్రామాలలో బంకులు ఉన్నాయి. జంపని, చావలిలో మూతపడ్డాయి. కొల్లూరు మండలంలో 6 బంకులు ఉండగా, దోనేపూడి బంకులు మూసేశారు. భట్టిప్రోలు మండలంలో 5 బంకులు, చుండూరు మండలంలో రెండు ఉన్నాయి. వీటిలోనూ కొన్నిచోట్లే పెట్రోలు లభ్యమైంది. డీజిల్‌ అస్సలు లేక పోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అమృతలూరు మండలంలోని బంకులను పోలీసులు తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement