నిజాంపట్నం (రేపల్లె): జిల్లాలో ఇంధన కొరత లేదని, వాహన చోదకులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ చెప్పారు. నిజాంపట్నం మండలం కూచినపూడిలోని పెట్రోలు బంకులో మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అక్రమ నిల్వలు చేయరాదని సూచించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఇది ప్రమాదకరమన్నారు. పెట్రోలు బంకులపై నిరంతరం తమ అధికారుల నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఇంధనం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. బంకులలో ఇంధనం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా నిర్వాహకులు స్టాకు లేదని చెప్పినా, అధిక మొత్తంలో విక్రయిస్తున్నా జిల్లా కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారులు 94932 47765 నంబరుకు విషయం తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు ఉన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మండలంలోని బొర్రావారిపాలెం గ్రామంలో జరుగుతున్న పంప్‌హౌస్, వాటర్‌పైప్ లైనింగ్ నిర్మాణం, మంచి నీటి కుంట నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. ఆయన వెంట గ్రామీణ నీటి పారుదల శాఖ ఎస్‌ఈ అనంతరాజు, డీపీఎల్‌వో ప్రభాకర్ తదితరులు ఉన్నారు.


