జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మీడియా సమావేశం ఆయన నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ నల్ల బజార్‌కు తరలి వెళ్లకుండా అరికట్టామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంక్‌లపై పర్యవేక్షణకు వీఆర్వోలు, ఉప తహసీల్దార్లను నియమించామన్నారు. పెట్రోల్ బంక్ యజమానులు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. 96 పెట్రోల్ బంకులు జిల్లాలో నడుస్తున్నాయన్నారు. అన్ని బంకుల్లో కొరత లేదన్నారు. కొండపల్లి నుంచి జిల్లాకు ఇండెంట్ మేరకు వాహనాలలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగానే వస్తుందన్నారు. కొండపల్లి ఐఓసీ దగ్గర జిల్లాకు సంబంధించిన వాహనాల పర్యవేక్షణ కొరకు ఇద్దరు ఉప కలెక్టర్లను నియమించామన్నారు. ప్రతిరోజు అక్కడ 250 వాహనాలను ఫుల్ చేస్తున్నారని వివరించారు. ఈరోజు 47 బంకులకు సంబంధించి ఇండెంట్స్ ఇవ్వగానే 24 వాహనాలు వచ్చేశాయని, నాలుగు వాహనాలు ప్రయాణంలో ఉండగా, మిగిలిన వాహనాలు ఫిల్ అవుతున్నాయన్నారు. అక్కడి నుంచి వస్తున్న వాహనాలకు జియో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంచామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు జిల్లా ప్రజలకు చాలినంత ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. 24 గంటల్లో 4.42 లక్షల లీటర్ల డీజిల్ జిల్లాకు రాగా 2.53 లక్షల లీటర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయన్నారు. 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ జిల్లాకు రాగా కేవలం 1.62 లక్షల లీటర్లు అమ్మకాలు జరిగాయన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందన్నారు. పెట్రోల్ బంక్ లలో డీజిల్ పదివేల లీటర్లు, పెట్రోలు 5000 లీటర్లకు చేరితే ముందుగా ఇండెంట్ ఇవ్వాలని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించామన్నారు. డీజిల్, పెట్రోలు పక్కదారి పట్టకుండా సీసీ కెమెరాలు నిఘా ఉంచామని, రాత్రిపూట ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు.
● భావన్నారాయణ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న 153 మీటర్ల రహదారిలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. చారిత్రాత్మకమైన దేవాలయానికి ఎదురుగా ఉన్న రహదారిని ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి, పూల కుండీలలో మొక్కలు నాటుతామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
జలధార కార్యక్రమం పర్యవేక్షణ
జిల్లాలో జలధార కార్యక్రమం కింద చేపట్టిన పనులను ప్రతి గ్రామంలో స్వయంగా సందర్శించి పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రతి పనిని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. జలధార కార్యక్రమానికి రూ.123 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులను సమర్థంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధి, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చెరువుల వద్ద విస్తృతంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. అధికారులు చొరవతో, చురుకుదనంతో పని చేసి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 20 మండలాల్లో దశలవారీగా పర్యటిస్తూ పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. ఉత్తమంగా పని చేసిన ఎంపీడీవోలకు ‘బెస్ట్ ఎంపీడీవో అవార్డు’ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. జలధార సమావేశానికి డ్వామా పీడీ విజయలక్ష్మి, ఏపీఎంఐ పీడీ సురేష్, హార్టికల్చర్ డీడీ కలీమ్, ఇరిగేషన్ విభాగ ఇంజినీర్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీఓలు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, బీట్ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు వర్టికల్‌గా హాజరయ్యారు.


