వేమూరు: బందరు పోర్టు పనుల వేగవంతంపై సోమవారం నిర్వహించిన సంకల్పన సాధన సమావేశానికి వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆర్టీసీ బస్సులో మచిలీపట్నం వెళ్లారు. డీజిల్ కొరత కారణం, పలు బంకుల్లో డీజిల్ పూర్తిగా లేకపోవడంతో అశోక్‌బాబు కారును ఇంటివద్ద ఉంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడడంతో బంకు వద్ద ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, ప్రైవేటు బస్సులు నిలిచిపోతున్నాయని అన్నారు. డీజిల్ కొరతతో సంకల్పన సాధన సమావేశానికి బస్సులో వెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తాడేపల్లిరూరల్: అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సోమవారం పేర్కొన్నారు. చిలకలూరి పేటకు చెందిన పెడవల్లి నాగేశ్వరరావు (45) ఈనెల 23వ తేదీ తన కుమార్తెతో బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆరోగ్యపరిస్థితిలో మార్పులేకపోవడంతో 24వ తేదీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యుల సలహా మేరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షల అనంతరం నాగేశ్వరరావుకు బ్రెయిన్‌లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్స ప్రారంభించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం బ్రెయిన్‌డెడ్‌గా పరిగణించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగేశ్వరరావు తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డిల ఆధ్వర్యంలో ఒక కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్ హాస్పిటల్‌లో అవసరమైన వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించారు. కార్నియాను విజయవాడ ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.
సృజనాత్మకతను వెలికితీసేందుకు శిక్షణ శిబిరాలు దోహదం
తాడేపల్లి రూరల్: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి వేసవి శిక్షణ శిబిరాలు తోడ్పడతాయని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర గ్రంథాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు సెల్‌ఫోన్‌కి బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుంటూరు రూరల్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇంచార్జి సౌత్ డీఎస్పీ బివి.మధుసూదన్‌రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలంకు చెందిన మిక్కిలి అనిత (33)కు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నాలాది మల్లికార్జునరావుతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.లక్షన్నర నగదు, 6 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో స్థలాన్ని కొనాలని అందుకు అనితను తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తేవాలని మల్లిఖార్జునరావు, నాలాది శివశంకరరావు, నాలాది మాథంగిషైనీలు తరచూ వేధించారు. దీంతో అనిత మళ్లీ తల్లిదండ్రులనుంచి మరో రూ.లక్ష తీసుకురాగా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా మల్లిఖార్జునరావు తన మరదలైన మాథంగి షైనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అనితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, డబ్బులు తీసుకురాకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. దీంతో వేధింపులు భరించలేక అనిత ఈనెల 9వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనపై మృతురాలి సోదరుడు మిక్కిలి ధర్మతేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరం ఒప్పుకోవటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


