మార్టూరు: ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటికల పోటీల విజేతగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నిలిచింది. స్థానిక మార్టూరు మండల కేంద్రంలో శ్రీకారం కళాపరిషత్, మార్టూరు రోటరీ క్లబ్‌లు సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించిన నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పోటీలలో విశేషంగా ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణీతల మన్ననలను సైతం ఆకట్టుకున్న గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక అత్యధికంగా ఐదు విభాగాల్లో బహుమతులు కై వసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుడివాడ వారు ప్రదర్శించిన ‘ద్వారబంధాల చంద్రయ్య నాయుడు’తో పాటు, విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికలు రెండు కూడా పోటాపోటీగా నిలిచి నాలుగు విభాగాల్లో బహుమతులు కై వసం చేసుకుని ద్వితీయ స్థానంలో నిలిచాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ‘సహాన’ నాటికతోపాటు బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారు ప్రదర్శించిన ‘కన్నీటికి విలువెంత నాటికలు మూడు విభాగాల్లో బహుమతులు గెలుచుకొని పోటాపోటీగా తృతీయ స్థానంలో నిలిచాయి. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారు ప్రదర్శించిన ‘దేవుణ్ణి చూశా’ నాటికలో పున్నయ్య చౌదరి ప్రత్యేక బహుమతితోనూ, హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’లో పూర్ణసత్యం ఉత్తమ సహాయ నటులుగా చె రొక బహుమతిని కై వసం చేసుకున్నారు.
ఉత్తమ దర్శకుడిగా గోవాడ వెంకట్..
అమ్మ చెక్కిన బొమ్మ ప్రదర్శనలో ఉత్తమ రచన బీశెట్టి జ్యోతి రాజ్, ఉత్తమ దర్శకుడు గోవాడ వెంకట్, ఉత్తమ నటుడు భాను ప్రకాష్, ఉత్తమ జ్యూరీ అవార్డు హర్షిణి, ఉత్తమ ప్రదర్శన గోవాడ క్రియేషన్స్ అందుకున్నారు. ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటికలో బీ నాగసాయి, ఎంఆర్వీ ఆర్ ప్రసాద్‌లు ప్రత్యేక బహుమతులు అందుకోగా ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్‌గా ఎస్ శ్రీనివాస్, ఉత్తమ మేకప్‌గా శేషగిరి బహుమతులు అందుకున్నారు. మమ్మల్ని బతకనివ్వండి ప్రదర్శనలో ఉత్తమ రంగాలంకరణకుగాను ఫణి, ఉత్తమ లైటింగ్ విభాగంలో రోహిత్, ఉత్తమ సంగీతం లీలామోహన్, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనకు గాను విజయవాడ సాంస్కృతిక సమితి బహుమతులు అందుకున్నారు. సహాన నాటికలో ఉత్తమ జ్యూరీ నటిగా కుసుమసాయి, వీసీ హెచ్ కే ప్రసాద్ ప్రత్యేక బహుమతి, ప్రత్యేక ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ వారు అందుకున్నారు. కన్నీటికి విలువెంత నాటికలో ఎం సౌమ్య ప్రత్యేక బహుమతిని, ఉత్తమ విలన్‌గా ఎస్ జ్యోతి రాణి, ఉత్తమ ప్రదర్శనగా బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారు బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలు, పరిషత్ నిర్వాహకులు, విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
విజేతగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’


