హెల్మెట్‌ ధారణతో ప్రాణరక్షణ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధారణతో ప్రాణరక్షణ

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

చీరాల: హెల్మెట్‌ ధరించడం భారం కాదని, అది రోడ్డు ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుతుందని ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ పేర్కొన్నారు. శిరోరక్ష–ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా సోమవారం చీరాలలోని మసీదు సెంటర్‌ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. గడిచిన 30 రోజులుగా జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌ వినియోగంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ద్విచక్రవాహనం నడిపే వారు తన ప్రాణాన్ని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్‌ ధరించాలని సూచించారు. హాయ్‌ రెస్టారెంట్‌, మసీదు సెంటర్‌ వద్ద హెల్మెట్‌ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని అభినందించారు. అలానే హెల్మెట్‌ లేనివారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎండీ మోయిన్‌, ఒన్‌టౌన్‌ సీఐ జి.సోమశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 38 అర్జీలు

గ్రీవెన్స్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ ఉమామహేశ్వర్‌ పేర్కొన్నారు. సోమవారం చీరాల ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో గ్రీవెన్స్‌ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చీరాల సబ్‌డివిజన్‌ పరిధిలో 38 మంది అర్జీలు అందజేయగా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఇకపై ప్రతివారం జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్‌, సీసీఎస్‌ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్‌, పీజీఆర్‌ఎస్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఒన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

అవసరమైన మేరకే ఇంధనం వాడుకోండి

వాహనదారులు అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్‌ సూచించారు. సమస్య తాత్కాలికమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. సోమవారం చీరాలలోని పలు ఫిల్లింగ్‌ స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేసి, యజమానులతో మాట్లాడారు. బ్లాక్‌లో పెట్రోలు, డీజిల్‌ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాక్‌ ఉన్నా, లేదని చెప్పి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌

Advertisement
 
Advertisement
Advertisement