జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి 9వ నాటకోత్సవాలు సోమవారం స్థానిక కస్తూర్బాగాంధీ మున్సిపల్‌ గరల్స్‌ హైస్కూల్‌ ఆవరణలో ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి డాక్టర్‌ రాయని హనుమంతరావు కళావేదికపై విజయవాడకు చెందిన త్రిధార ది ఆర్ట్స్‌ ల్యాండ్‌ బృందం కూచిపూడి నృత్యం, శ్రీరామ పట్టాభిషేకం నృత్య రూపకం ప్రదర్శించారు. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన మానవతా సాగరి బృందం ప్రదర్శించిన ‘అందరూ మంచివారే..కానీ.?’ నాటిక మనుషుల మధ్య మంచితనం విలువను చాటింది. నాటికకు జరుబుల రామారావు స్వీయ రచన, దర్శకత్వం వహించారు. అనంతరం గుంటూరుకు చెందిన శ్రీరమణ కళా నిలయం వారు మాతృత్వం నాటికను ప్రదర్శించారు. తల్లి బిడ్డల్ని వేరు చేయాలని చూస్తే భర్తలకు వ్యతిరేకంగా మహిళలంతా ఏకమవుతారని చాటే సందేశంతో నాటిక సాగింది. సుఖమంచి కోటేశ్వరరావు రచించిన ఈ నాటికకు పొగర్తి నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రదర్శన అనంతరం నటీనటులు, రచయితలు, దర్శకులను ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరై నాటికలను ఆసక్తిగా తిలకించారు. కళాంజలి సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement