బాపట్ల : భారతీయ వ్యవసాయాన్ని సుస్థిరత, సాంకేతికత, సమగ్ర అభివృద్ధి దిశగా మలచాలనే లక్ష్యంతో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాల, బాపట్ల ఆధ్వర్యాన పి.జి.విద్యార్థుల జాతీయ సదస్సును ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘పరిశోధన, వాస్తవాల మధ్య వారధి, స్థిరమైన రైతులు, ఆహార వ్యవస్థలు, సమాజ సంక్షేమం కోసం స్మార్ట్ ఆవిష్కరణలు’ అనే ప్రధాన అంశంతో జరిగే ఈ జాతీయ సదస్సు వ్యవసాయ పరిశోధనలను రైతు అవసరాలతో అనుసంధానం చేసే కీలక వేదికగా నిలవనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 15 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి పరిశోధన సంస్థల నుంచి దాదాపుగా 800 మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని తమ పరిశోధన ఫలితాలను ప్రదర్శించనున్నారని ఆమె వివరించారు. సదస్సుకు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షత వహించనున్నారని, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, పి.జె.టి.యస్.ఏ.యు., ఆర్.వి.యస్.కె.వి.వి., గ్వాలియర్ మాజీ ఉప కులపతి డా.సూరపనేని కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని, డీన్ అఫ్ పి.జి. స్టడీస్ డాక్టర్ ఏ.వి.రమణ ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, వివిధ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల నిపుణులు కీలక ప్రసంగాలు చేస్తారని తెలిపారు.


