– వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదనరెడ్డి
పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు మాత్రమే లాభం చేకూర్చేందుకే పెట్రోల్, డీజిల్‌ను కృత్రిమ కొరత సృష్టించి చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పన్నాగానికి తెర లేపిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి విమర్శించారు. పర్చూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కొరత ఉండటానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న పోకడలే కారణమని దుయ్యబట్టారు. అధికార పార్టీకి చెందిన తొత్తులకు లాభం చేకూర్చడమే కాకుండా దళారీ వ్యవస్థను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆయన విమర్శించారు.
దళారులు ఆయిల్‌ను భారీ మొత్తంలో నిల్వపెట్టుకొని రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతను సృష్టించడం ద్వారా సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిమితిగా ఆయిల్ పంపిణీ చేయాలంటూ చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.


