నేరాలకు అడ్డా! | - | Sakshi
Sakshi News home page

నేరాలకు అడ్డా!

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

నేరాలకు అడ్డా!

హెచ్చరిల్లుతున్న నేర సంస్కృతి పుట్టగొడుగుల్లా మద్యం బెల్ట్‌ షాపులు పలు ప్రాంతాల్లో పేకాట, క్రికెట్‌ బెట్టింగులు కొత్తగా విధుల్లో చేరిన సీఐలకు ఎదురయ్యే సవాళ్లు

చీరాల అర్బన్‌: అలక్ష్యం.. అహంకారం రాజ్యమేలుతోంది. బాబు జమానాలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. గంజాయి, బెట్టింగ్‌లతో పాటు జూదం యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు గొప్పులు చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. దీంతో చీరాల నియోజకవర్గంకు నేరాలకు అడ్డాగా మారిపోయింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీస్‌, ఎకై ్సజ్‌ అధికారులకు సవాల్‌గా మారింది.

మొదటి వారంలోనే..

టీడీపీ ప్రభుత్వంలో గంజాయి మాఫియా పెరిగింది. ఈ నెల మొదటి వారంలో వేటపాలెంలో 15.50 కిలోల గంజాయి పట్టుబడింది. గత వారంలో బాపట్లలో 27.50 కిలోల గంజాయి పట్టుబడింది. రెండు రోజుల క్రితం చీరాలలో 56 ప్యాకెట్లు గంజాయి(630 గ్రాములు) పట్టుబడింది. దీనిపై జీఆర్‌పీ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే పట్టుబడుతున్న మొత్తం కన్నా సంబంధిత అధికారుల కళ్లు కప్పి గంజాయి వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా మరింత నిఘా పెట్టాల్సి ఉంది.

గాంబ్లింగ్‌..

గాంబ్లింగ్‌ ప్రధానంగా పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ పట్టణంలోని పలు లాడ్జిలు, తీరప్రాంతంలోని రిసార్ట్స్‌, హోటల్స్‌లో సాగుతున్నాయి. అలా గుర్తింపు పొందిన హోటల్స్‌, లాడ్జిలు, రిసార్టులను కింగ్‌ పిన్‌ గాంబ్లర్స్‌గా గుర్తింపు పొందిన వారు ఎంచుకుంటారు. వారు మిగిలిన జూదప్రియులు ఏ వారం ఎక్కడ బస చేయాలో ముందుగానే చెప్తారు. ఆ ప్రకారం సదరు జూద ప్రియులు పర్యాటకులు, వ్యాపారులు ముసుగులో ఆయా వారాల్లో వారు సూచించిన చోట బస చేస్తారు. తరువాత అందరూ కలిసి తమ జూద క్రీడను కొనసాగిస్తారు. ఇది కొందరు అధికారులకు కూడా తెలుసు. వారందరికీ రాజకీయ అండ ఉందనేది బహిరంగ రహస్యం. వీటితో పాటు షేర్‌ మార్కెట్‌ సెన్సెక్స్‌ ఆధారంగా కూడా కొందరు జూదం ఆడుతున్నారు. ఇక బ్రాకెట్‌ ఆట సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ సాలెగూడులో చిక్కుకున్న కొందరు నైతికంగా, ఆర్థికంగా చితికిపోయి బలన్మరణం పొందినవారు ఉంటున్నారు.

రూ.20 నుంచి రూ.50 అదనంగా..

చీరాల ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలో మద్యం బెల్ట్‌ షాపులు జోరుగా సాగుతున్నాయి. ఈ షాపుల్లో క్వార్టర్‌ బాటిల్‌కు అసలు ధర కన్నా సందర్భాన్ని బట్టి రూ.20 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో మద్యపాన ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నియంత్రించాల్సిన ఎకై ్సజ్‌ అధికారుల చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు. తీర ప్రాంతంలో బహిరంగ వేలం పాటలు ద్వారా బెల్ట్‌ దుకాణాలను దక్కించుకున్న వారు అదనపు ధరలకు మద్యం విక్రయాలు బహిరంగంగా విక్రయించటం అందుకు కారణంగా చెబుతున్నారు.

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

ఇటీవల కాలంలో జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలువురు ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది. మద్యం తాగిన క్రమంలో కొన్ని సందర్భాల్లో, హెల్మెట్లు లేక కొన్ని సందర్భాల్లోనూ వాహన చోదకులు గాయపడుతున్నారు. తాజాగా రామాపురం రోడ్డులో మన్నం అపార్ట్‌మెంట్‌కు కూతవేటు దూరంలో 216 జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు సరైన చర్య కాదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంత కూడలి ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్‌గా గుర్తింపు పొందింది.

ఇసుక అక్రమ తవ్వకాలు

చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా అధీకృత ఇసుక రీచ్‌లు లేవు. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించినపుడు ఒకటి, రెండు రోజులు ఆపి మమ అనిపిస్తారు. తరువాత తమ దందాను సాగిస్తుంటారు. అందుకు రాజకీయ అండ కారణం. చీరాల నియోజకవర్గం నుంచి రేషన్‌ బియ్యం ప్రతి నెలా నల్లబజారు తరలుతుంటాయి. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఈ దందా సాగిస్తున్నాడు.

కట్టడి చేస్తారా .. కలిసి పోతారా!

ఈ క్రమంలో చీరాల వన్‌టౌన్‌, టూ టౌన్‌, రూరల్‌ పోలీస్‌ సర్కిళ్లకు కొత్త ఇన్‌స్పెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల క్రితం చీరాల ఎకై ్సజ్‌ సర్కిల్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరిగే అక్రమాలను అరికట్టి అక్రమార్కులకు చెక్‌ చెప్తారా.. లేకుంటే వారితో కలసి పోతారా అనే కోణంలో రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోను చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement