ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా జనగణనలో పాల్గొనాలి డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్
బాపట్ల: ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా 2027 జనాభా నమోదు ప్రక్రియలో పాల్గొనాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ కోరారు. జనాభా– 2027 స్వీయనమోదుపై అవగాహన కోసం 5కే రన్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం నుంచి జెండా ఊపి 5 కెకే రన్ ర్యాలీని ప్రారంభించారు.
డీఆర్‌ఓ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో జనాభా గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సరైన డేటా ఆధారంగా వనరుల పంపిణీ, మౌలిక సదుపాయాల దేశ ఆర్థికాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం వంటి అంశాలలో నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా లెక్కల సేకరణ 2027 లో జిల్లాలో ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. మే ఒకటి నుంచి ప్రతి ఇంటింటికి జనాభా లెక్కలు సేకరణకు అధికారులు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి పూర్తి వివరాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌డీ ఓ శ్రీనివాసరావు, డీఈ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.


