రాత్రివేళ రైట్‌.. రైట్‌.. | - | Sakshi
Sakshi News home page

రాత్రివేళ రైట్‌.. రైట్‌..

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

ఆగుదామా ... ఆగి సాగుదామా...

ఆపేది లేదు ...

అడ్డుకునేది లేదు !

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై మూజువాణి ఒప్పందం

క్రియాశీలక పాత్ర పోషించిన ఇద్దరు అధికారులు

కలెక్టర్‌ దృష్టి సారించారు ..

కాస్త ఆగండి

ఇసుక అక్రమార్కులు, సదరు అధికారుల మధ్య ఒప్పందం?

కీలక పాత్ర పోషించిన కీలక నేత, యువనేతలు

దేనికి సంకేతం అంటున్న ప్రజలు

చీరాల అర్బన్‌: చీరాల నియోజకవర్గంలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు లేవు. ఎవరికీ ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించి అనుమతులు లేవని అధికారులు పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. దీనిపై తోడేస్తున్న ఇసుకాసురులు అనే శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. జరుగుతున్న ఇసుక అక్రమాలపై సమగ్రంగా వివరించటం జరిగింది. విషయాన్ని స్థానిక అధికారులతో పాటు, కలెక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది. దీంతో స్థానిక అధికారులు ఒకింత అప్రమత్తమయ్యారు. తాత్కాలికంగా పగలు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ఆపాలని, రెండు రోజులు ఆగి విషయం కాస్త సద్దుమణిగాక యథావిధిగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగించేందుకు మూజువాణి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అయితే అప్పుడు కూడా పగలు ఎలాంటి తవ్వకాలు, రవాణా వద్దని, రాత్రి వేళ రైట్‌, రైట్‌ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

నిన్న, మొన్నటి వరకు కీలక నేత, యువనేతలు చెప్పిందే అక్రమ సామ్రాజ్యంలో తుది మాట. అయితే అక్రమ ఇసుక దందాలో ఆధిపత్య పోరుతో ఒకరికి ఒకరు పునరాలోచనలో పడ్డట్లు చెప్పుకుంటున్నారు. అందుకు అనుగుణంగా బేషరతుగా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి ఇద్దరు అధికారులు మధ్యే మార్గంగా క్రియాశీలక పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో కీలక నేత, యువనేతల మనుషులైనా, లేదా సంస్థ మనుషులైనా ఎవరైనా పగటి పూట ఇసుక తవ్వకాలు, రవాణా జరపకూడాదు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అక్రమ ఇసుక దందా సాగించవచ్చని ఓ ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ దందాలో వ్యక్తులు తమ సన్నిహితులు వద్ద చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా దందా ఆగుతుందా. సాగుతుందా. ఇది అధికారుల చిత్తశుద్ధికి ఒక పరీక్షలా మారిందని మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ తదితర విభాగాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది కాబట్టి కట్టడి చేస్తారా, లేకుంటే రాజకీయ చదరంగంలో ఆయన కూడా ఒక పావుగా మారే పరిస్థితులు ఏర్పడతాయా అనే కోణంలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే కలెక్టర్‌ వాస్తవాలను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి అక్రమ ఇసుక దందాకు చెక్‌ చెప్తారని ప్రజలు నమ్ముతున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. శుక్రవారం నియోజకర్గ పరిఽధిలో ఎక్కడ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగపోవటం గమనార్హం. నియోజకవర్గంలో కలెక్టర్‌ పర్యటన ఉండటంతో పాటు సాక్షి పత్రికలో వెలువరించిన కథనాలు కూడా కారణమని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సహజ వనరుల దోపిడీ అగుతుందని ప్రజలు ఆభిప్రాయ పడుతున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు కొనసాగిస్తారని ఆశిద్దాం.

ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాకు సంబంధించి కీలక నేత, యువనేతలు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. ఆపేది లేదు. అడ్డుకునేది లేదు. విషయం కలెక్టర్‌ దృష్టికి వెళ్లింది. కాబట్టి రెండు రోజులు ఆగండి. సంబంధిత అధికారులతో మాట్లాడాం. సిండికేట్‌ పగలకుండా చూసుకోండి. ఎప్పటి మాదిరిగానే ఇసుక అక్రమ దందా కొనసాగుతందని కీలక నేత, యువనేతల తరఫున వారి అనుయాయులు అభయం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement