సామాజిక స్పృహ కల్పించేదే నాటిక | - | Sakshi
Sakshi News home page

సామాజిక స్పృహ కల్పించేదే నాటిక

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

సామాజిక స్పృహ కల్పించేదే నాటిక

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌

గన్నమనేని రామకృష్ణప్రసాద్‌

అట్టహాసంగా ప్రారంభమైన

నాటికల పోటీలు

మార్టూరు: సామాజిక రుగ్మతలకు పరిష్కారం చూపుతూ గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యులను సైతం చైతన్యవంతం చేయగలిగితేనే నాటకం లక్ష్యం నెరవేరినట్లు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ అన్నారు. స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో శుక్రవారం రాత్రి మార్టూరు రోటరీ క్లబ్‌, శ్రీకారం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. 16 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోసామాజిక చైతన్యమే లక్ష్యంగా వ్యయ ప్రయాసల కోర్చి నాటక పరిషత్తులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన 3150 రోటరీ జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ ఎస్వీ రాంప్రసాద్‌ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎన్‌ ముక్తేశ్వరరావు స్థానిక నిర్వహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నాటికల పోటీలను ప్రారంభించారు.

మనుషుల హృదయాల్లోనే దేవడు ఉంటాడు..

మొదటి నాటికగా అరవింద ఆర్ట్స్‌ తాడేపల్లి వారు ప్రదర్శించిన దేవుణ్ణి చూశా నాటిక ప్రేక్షకులను రక్తి కట్టించింది. దైవం మానుష రూపేణా అనే నానుడి ప్రకారం దేవుడు దేవాలయాల్లోనూ కనిపించడని లోకాల్లోనూ ఉండడని మానవత్వం మూర్తీ భవించిన మనుషుల హృదయాలలో ఉంటాడనే ఇతివృత్తంతో దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ మూల కథకు యల్లాప్రగడ భాస్కరరావు నాటకీకరణ చేయగా గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు.

నేటి ప్రభుత్వాలపై వదిలిన సైటెర్‌..

రెండో నాటికగా కళానికేతన్‌ వీరన్నపాలెం వారు ప్రదర్శించిన ‘దీపం కింద చీకటి’ నేటి ప్రభుత్వాలపై వదిలిన సైటెర్‌ లా ఉందని ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో తెలియజేశారు. రౌడీలు, తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల వంటి నేరస్తులను సంవత్సరాల తరబడి జైల్లో ఉంచి వారికి సకల సౌకర్యాలను కల్పిస్తున్న ప్రభుత్వం నిజాయితీగా కష్టపడి జీవనం సాగించే సామాన్యులకు కనీస వైద్య సౌకర్యం కల్పించడంలో చూపుతున్న అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని నటీనటులు జనరంజకంగా ప్రదర్శించారు.

వృద్ధ దంపతుల జీవన పోరాట..

మూడో నాటికగా విజయవాడ సాంస్కృతిక సమితి వారు ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికను ప్రదర్శించారు. తుఫాను మధ్యలో చిక్కుక్కున్న ఇద్దరు వృద్ధ దంపతుల జీవన పోరాటమే ఈ నాటిక ఇతివృత్తం. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు. మొదటి రోజు కార్యక్రమంలో రోటరీ 3020 జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ ఏలూరి కళ్యాణ చక్రవర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌ మన్నం మోహనకృష్ణ, గుంటూరు ఎల్వీఆర్‌ సన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు నూకవరపు కోటేశ్వరరావు, అబ్దుల్‌ కలాం సేవా పురస్కార గ్రహీత సింగారెడ్డి శౌరి రెడ్డి, ఎఫర్ట్‌ సంస్థ డైరెక్టర్‌ జాష్టి మోహన్రావు, శ్రీకారం కళాపరిషత్‌ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు, జాష్టి అనూరాధ మార్టూరు రోటరీ క్లబ్‌ అధ్యక్ష కార్యదర్శులు మాదాల సాంబశివరావు, చెరుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌

‘దేవుణ్ణి చూశా’ నాటికలోని ఓ సన్నివేశం

Advertisement
 
Advertisement
Advertisement