పంపకాల్లో ఆధిపత్య పోరు
పగలు ఒకరు..రాత్రి మరొకరు
మధ్యవర్తులుగా కొందరు అధికారుల రాయబేరాలు
కీలకనేత, యువనేతల పక్షాన కొందరు..
ఎవరి స్వలాభం వారిది
యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
అధికారుల మధ్య పొంతన లేని జవాబులు
కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే కట్టడి
మా పరంగా ఎవరికి అనుమతి లేదు
అనుమతులు లేవు
చంద్రబాబు పాలనలో ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా సహజ వనరుల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. ఇది అందరికీ కనిపిస్తున్న బహిరంగ రహస్యం. కానీ సంబంధిత అధికారులకు మాత్రం కనిపించదు. కన్నెర్ర చేయాల్సిన పాలకులు, కట్టడి చేయాల్సిన అధికారులు ఒక్కటయ్యారు. దోచుకుందాం, పంచుకుందాం అనే ధోరణితో ముందుకు సాగుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందా అంతా ఇంతా కాదు. దీనిపై జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అంటున్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌లకు అనుమతి ఉన్న ప్రాంతాల జాబితాలో చీరాల నియోజకవర్గం లేదు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. అయితే కీలకనేత, యువనేత, సంబంధిత అధికారులకు మాత్రం ఆ విషయం తెలీదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు
ఇసుక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు గతంలో పతాక స్థాయికి చేరింది. చీరాల మండలం బోయినవారిపాలెం పరిఽధిలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులుగా గుర్తింపు పొందిన వారి మధ్య వివాదం నెలకొంది. ఆ క్రమంలో ఓ పొక్లయినర్‌కు నిప్పు పెట్టినట్లు వాదనలు బలంగా వినిపించాయి. అందుకు సంబంధించిన కేసు ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. ఈ సంఘటన తరువాత నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా సాగించే వారి మధ్య కొందరి ప్రమేయంతో సయోధ్య కుదిరినట్లు చెప్పుకున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ క్వారీయింగ్ ఎక్కడ జరిగినా కీలక నేత, యువనేతలకు ట్రాక్టర్‌కు రూ.300, ఇతర సంబంధీకులకు వారి, వారి స్థాయిని బట్టి మామూళ్లు ఇచ్చుకుంటూ సాఫీగా దందా సాగిస్తున్నారని వినికిడి.
వాళ్లకిచ్చి..మీకిచ్చి..
ఈ క్రమంలో ఓ సంస్థ మాకు రాయల్టీ వసూలు చేసుకునే హక్కు ఉందని ముందుకొచ్చారు. వారు ఒక్కో ఇసుక ట్రాక్టర్ వద్ద రూ.200 రాయల్టీగా వసూలు చేస్తున్నారని, కీలకనేతకు, యువనేతకు ట్రక్కుకు రూ.300 చెల్లిస్తూ, క్వారీ వాళ్లకు నిర్ణీత ధర, ఇతరత్రా ఖర్చులు చెల్లిస్తుంటే తమకు గిట్టుబాటు కావటం లేదనే అసంతృప్తులతో మళ్లీ వివాదాలు తెరకెక్కాయని చెప్పుకుంటున్నారు.
రాత్రి ఒకరు ... పగలు మరొకరు
కట్టడి చేయాల్సిన అధికారుల తీరు కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. కీలక నేత, యువనేతలకు సంబంధించి వారు పగటి వేళ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగించకూడదు. సంస్థకు సంబంధించిన వారు రాత్రి వేళ ఇసుక తవ్వకాలు, రవాణా సాగించకూడదని ఇద్దరు అధికారులు మధ్యే మార్గంగా సలహా ఇచ్చి సమస్యను సర్దిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. లేదంటే వచ్చే నగదు అందరం నష్టపోవల్సి వస్తుందని హితవు పలికినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓ సంస్థ తరఫున మరికొందరు
చీరాల నియోజకవర్గంలో మా పరంగా ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. ఏఎంఆర్ సంస్థకు గ్రావెల్, గ్రానైట్ తదితరాలకు మాత్రమే రాయల్టీ వసూలు అధికారం ఉంది. ఇసుకకు సంబంధించి లేదు. – శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, బాపట్ల
ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎవరికి అనుమతులు లేవు. సమాచారం అందిన వెంటనే చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో ప్రత్యేక సూచనలు చేశాం.
– చంద్రశేఖర్‌నాయుడు, ఆర్డీఓ, చీరాల


