రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున రైతులను పార్టీలకతీతంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే పంటలకు గిట్టుబాటు ధర అందించాలని వినతిపత్రం

ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పరిపాలన సాగుతుందని.. దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ నాగార్జున ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి గురువారం ఇంకొల్లు తహసీల్దార్‌ ఏవీఎస్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులు నియోజకవర్గంతోపాటు జిల్లా అంతటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఇటీవల వరి సాగు చేసిన రైతులు నష్టపోయిన విషయం తెలిసిన విషయమేనని అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న రైతుల పరిస్థితి పూర్తిగా దళారీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోగా స్పందించాల్సిన మంత్రి మేము కొనలేం.. అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా పార్టీలకఅతీతంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌, సొసైటీల ద్వారా రూ.2400 మద్దతు ధర ప్రకటించి పార్టీలకతీతంగా కొనుగోలు చేసి ప్రతి రైతుకు న్యాయం చేశామన్నారు. నేటి ప్రభుత్వంలో రూ.2400 మద్దతు ధర ప్రకటించి కొనకపోవడంతో రైతు రూ.1500, రూ.1600 అమ్ముకొనే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. తక్షణమే జొన్న, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా, సొసైటీల ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం..

కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రులకు కూడా సమస్యను తెలియజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో శనగ కొనే పరిస్థితి లేదని, కౌలు, కూలీ రైతులు ఎక్కువ మంది ఉన్నారని వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈవిషయంపై జగన్‌ను కలిసి సమస్యను వివరిస్తామన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసగిస్తోంది..

నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కజొన్న, శనగ రైతులను మోసం చేసిందన్నారు. మొక్కజొన్న, శనగ దిగుబడులు అధికంగా వచ్చాయని రైతులు ఆనందం పడేలోగా మద్దతు ధర లేక ఆందోళన చెందారన్నారు. కొంత మంది తెలివిగా రైతుల వద్ద నుంచి శనగను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీలలో పెడుతున్నారని రాబోయే రోజుల్లో ఎక్కువ ధరకు అమ్ముకొనే కుటిల ఆలోచనలతో దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మంచి చేయాలని వైఎస్సార్‌ సీపీ కోరుకుంటున్నట్లు తెలిపారు. మొక్కజొన్న, శనగ ప్రభుత్వం కొనేలాగా రైతుల తరపున పోరాడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చిన్నిపూర్ణారావు, జిల్లా రైతు విభాగం కార్యదర్శి సింహాద్రి బ్రహ్మారెడ్డి, పులఖండం జయరామరెడ్డి, మాజీ సర్పంచ్‌ పులఖండం వెంకారెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు నూతలపాటి బలరాం, శ్రీనివాసరావు, రావి పేరయ్యచౌదరి, పోపూరి మోహనరావు, ఇంకొల్లు పట్టణ అధ్యక్షుడు కరివాసు, బలరామరాజు, వెంకటేశ్వరరాజు, జఖరయ్య, పీ ప్రసాద్‌ తలకాయల కోటి, ఎం శ్రీరాములు, అన్ని గ్రామాల మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు తదితులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement