రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లాకు పేరు తీసుకురావాలి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లాకు పేరు తీసుకురావాలి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో పతకాలు సాధించి గుంటూరు జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్‌ ఖాన్‌ అన్నారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీఆర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా సీనియర్‌ అథ్లెటిక్‌ ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపికల్లో జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టు ఎంపిక చేసి మే నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో జరిగే ఏపీ స్టేట్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో శాప్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌లు వెంకటేశ్వరరావు, శివారెడ్డి, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, సభ్యులు కే అరుణ్‌కుమార్‌, నాని తదితరులు పాల్గొన్నారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

మార్టూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈఘటన గురువారం మధ్యాహ్నం స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతురాలి సమీప బంధువుల వివరాల మేరకు.. కోలలపూడి గ్రామానికి చెందిన చేటూరి సుబ్బరావమ్మ (65) స్థానిక కూరగాయల మార్కెట్‌ ఎదురుగా రహదారి దాటే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు సుబ్బారావమ్మను ఢీ కొట్టింది. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. సుబ్బరావమ్మను స్థానికులు 108 సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే క్రమంలో సుబ్బరావమ్మ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని మార్టూరు వెలుపల కారు వదిలి పరారయ్యాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

డ్వాక్రా గ్రూప్‌ లీడర్‌ అరెస్ట్‌

దాచేపల్లి : పొదుపు డబ్బులను దుర్వినియోగం చేసిన డ్వాక్రా గ్రూప్‌ లీడర్‌ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. దాచేపల్లిలోని యాసిన్‌ పొదుపు గ్రూప్‌ సభ్యులు ఎస్‌బీఐ బ్యాంక్‌లో తీసుకున్న రూ.15లక్షల రుణానికి సంబంధించి ప్రతి నెల రూ.50వేలు బ్యాంక్‌లో అప్పు కింద జమ చేసేందుకు గ్రూప్‌ లీడర్‌ సయ్యద్‌ నూర్జహాన్‌ అప్పగించారని, ఈ క్రమంలో గ్రూప్‌ సభ్యులు బ్యాంక్‌లో అప్పు కింద చేసేందుకు ఇచ్చిన డబ్బులను నూర్జహాన్‌ సొంతానికి వాడుకుని, దుర్వినియోగం చేసిందని గ్రూప్‌ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నూర్జహాన్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement