రెండు నూతన బస్సు సర్వీసులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రెండు నూతన బస్సు సర్వీసులు ప్రారంభం

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

రెండు నూతన బస్సు సర్వీసులు ప్రారంభం 26న బాపట్లలో 5కే రన్‌ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి అరెస్ట్‌

బాపట్ల: ఒంగోలు నుంచి తెనాలి, తెనాలి నుంచి ఒంగోలు వరకు (చీరాల, బాపట్ల, చెరుకుపల్లి మార్గంగా) ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులను బుధవారం ప్రారంభించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్‌.విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెనాలి బస్టాండ్‌ నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలు రెండు సర్వేసులు బయలుదేరుతాయని చెప్పారు. ఒంగోలు బస్టాండ్‌ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు తెనాలికి రెండు సర్వేసులు నడపడం జరుగుతుందని వివరించారు. తెనాలి నుంచి ఒంగోలు వరకు(చీరాల, బాపట్ల, చెరుకుపల్లి మార్గంగా) ఎక్స్‌ప్రెస్‌ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈసౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

బాపట్ల: జనగణన– 2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 26న (ఆదివారం) బాపట్లలో 5కే రన్‌్‌ నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ గంగాధర్‌ గౌడ్‌ తెలిపారు. సెల్ఫ్‌ ఎన్యుమరేషనన్‌ పై ప్రజలకు చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం డీఆర్వో చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు, విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

తెనాలిరూరల్‌: రైలు కింద పడి తెనాలిలోని పినపాడు రైల్వే గేట్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పట్టణ ముత్తెంశెట్టిపాలెం మల్లాది వారి వీధికి చెందిన కోటపాటి కళ్యాణ్‌ చక్రవర్తి(53) వందే భారత్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ ఎల్‌.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వినుకొండ: కోర్టు వారెంట్‌ను అమలు చేసేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం, ఆవులమంద గ్రామానికి చెందిన పిడతల అనూషకు, పిడతల పూల రంగయ్యతో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా, ప్రస్తుతం వినుకొండలోని శాలివాహన నగర్‌లో నివాసం ఉంటున్న అనూష స్థానిక కోర్టులో భర్తపై భరణం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడైన పూల రంగయ్య కోర్టుకు హాజరుకాకపోవడంతో, వినుకొండ కోర్టు అతనిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న పూల రంగయ్యపై వారెంట్‌ను అమలు చేసేందుకు వినుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుళ్లు సుబ్బారావు, సత్యరావు హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ పూల రంగయ్య పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రవర్తించారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు గాను హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ ఎస్‌హెచ్‌ఓ బి.ప్రభాకర్‌ కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు పూల రంగయ్యను అరెస్ట్‌ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement