మా బాధ్యత మేం నిర్వహిస్తున్నాం
చంద్రబాబు మాటలు నీటి మూటలు ప్రకటనకే పరిమితమైన మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటా రూ.2,400లకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ ప్రకటన ప్రభుత్వ పరంగా మొదలు కాని మొక్కజొన్న కొనుగోళ్లు క్వింటా రూ.1,710లకు కొనుగోలు చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు రైతుల వెన్ను విరుస్తున్న చంద్రబాబు సర్కార్
దళారులకు అమ్మితే నష్టాలే..
దిగుబడి ఉంది.. ధరే లేదు
మొక్కజొన్న రైతుల ఆవేదన
‘మోంథా’ పరిహారమేదీ?
చీరాల అర్బన్: రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మద్దతు ధర విషయంలో రైతులకు ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ.2,400గా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకు ఒక్క క్వింటా కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. గతేడాది అక్టోబర్‌లో మోంథా తుఫాన్ పరిహారం ఇంత వరకు అందించలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరరంగా మారింది. ఇటు దళారులకు తక్కువ ధరకే పంటను తెగనమ్ముకోలేక, అటు పంట ఉత్పత్తిని నిల్వ చేసుకునే దారిలేక రైతులు సతమతం అవుతూ.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాటలతో మాయ చేస్తున్నారని మండిపడుతున్నారు.
మాటల్లో పండగ.. చేతల్లో దండగ
చంద్రబాబు పాలనలో వ్యవసాయం మాటల్లోనే పండగ.. చేతల్లో దండగ అన్న తీరులో ఉంటోంది. పంటలకు గిట్టుబాటు ధర అటుంచితే కనీస మద్దతు ధర కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత ఖరీఫ్‌లో 1,27,000 హెక్టార్లలో, రబీలో 1,78,000 హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో రబీలో 51,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. పంటను కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పంట చేతికొచ్చింది. అమ్ముదామంటే కనీసం మద్దతు ధర కూడా లేదు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటా రూ.1,710 నుంచి రూ.1,740 మధ్య విక్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర ప్రకటిస్తే సరిపోతుందా?
మద్దతు ధర కల్పించడంతోపాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే విషయంలో బాబు సర్కారు తీరు శనగలు తిని చేయి కడిగేసుకున్నట్లుగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు. ‘కేంద్రానికి లేఖ రాశాం. క్వింటా రూ.2,400కు కొనుగోలు చేస్తామని ప్రకటించాం. దీంతో తమ పనైపోయిందన్న భావనలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఉన్నార’ని రైతులు మండిపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వపరంగా మా వంతు కృషి మేం చేస్తున్నాం. మొక్కజొన్న క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించారు. కొనుగోళ్లకు సంబంధించి కార్యాచరణ జరుగుతోంది. ఇన్‌పుట్ సబ్సి డీ కూడా పంట నష్టపోయిన రైతులకు అందాల్సి ఉంది.
– విజయనిర్మల, డీఏఓ, బాపట్ల
ప్రైవేట్ వ్యాపారులు మొక్కజొన్న క్వింటా రూ.1,710కి కొనుగోలు చేస్తున్నారు. ఆ ధరకు విక్రయిస్తే నష్టాలే మిగులుతాయి. నాలుగు ఎకరాలు సొంతంగా, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశాం. పెట్టుబడికి తెచ్చిన అప్పులు చెల్లించాల్సి ఉంది. నష్టాలు మూట కట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో గోడౌన్‌లో నిల్వ చేస్తున్నా. వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– సుధాకర్, చెరుకూరు, పర్చూరు మండలం
మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశా. దిగుబడి ఒకింత పర్వాలేదు. అయితే ధర లేదు. మద్దతు ధర రూ.2,400 అని చెబుతున్నారు. ఎప్పుడు కొంటారో తెలీదు. పరిస్థితి బాగా లేదు. మా బంధువు క్వింటా రూ.1,740కి ప్రైవేట్ వ్యాపారికి అమ్మాడు.
– పవన్, శాంతినగర్, చీరాల
గత ఏడాది మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని పాక్షికంగా, కొన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. పంట నష్టపరిహారం అంచనాకు కేంద్ర బృందం రాక ఆలస్యమైంది. వాస్తవానికి జరిగిన నష్టం కొంతయితే, నమోదు గోరంతగా ఉందని రైతులు అప్పట్లోనే విమర్శించారు. మొత్తం మీద జిల్లాలో 18,609 మంది రైతులకు సంబంధించి 12,700 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని నమోదు చేశారు. అందుకుగాను రూ.2,395 లక్షల మేర నష్టపరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) అందించాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ పంట నష్టపరిహారం నేటికీ అందలేదు.


