ఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి | - | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

ముఖానికి మాస్క్‌లు వేసుకుని వచ్చిన దుండగులు సామగ్రిని పగలగొట్టి, అపహరించిన వైనం రోగులను భయబ్రాంతులకు గురిచేసిన దుండగులు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించిన బాధిత వైద్యుడు పోలీసుల అదుపులో ఇరువురు నిందితులు

పట్టించుకోని నల్లపాడు పోలీసులు

గుంటూరు రూరల్‌: అర్ధరాత్రి ఆసుపత్రిపై దాడిచేసి ఆసుపత్రిలోని సామగ్రిని పగలగొట్టి రోగులను సైతం భయబ్రాంతులకు గురిచేసిన సంఘటన నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు, ఆసుపత్రి వైద్యుడు గొర్రె వెంకటశ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..

వైద్యుడు శ్రీనివాసరావు సంక్రాంతి బాలమౌనిక అనే మహిళ వద్ద ఇన్నర్‌ రింగ్‌రోడ్డు రెడ్డిపాలెం సమీపంలోని బిల్డింగ్‌ను 2021లో ఆరు సంవత్సరాల లీజు ప్రాతిపదికన అగ్రిమెంట్‌ చేసుకుని అద్దెకు తీసుకుని ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. అగ్రిమెంట్‌ ప్రకారం బాధితుడికి నవంబర్‌ 25, 2027 వరకూ ఆ బిల్డింగ్‌పై హక్కు ఉంది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్‌నుంచి అల్లడి ప్రసాద్‌ అనే వ్యక్తి ఆసుపత్రికి వచ్చి పలుమార్లు ఆసుపత్రి బిల్డంగ్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బిల్డింగ్‌ తనదని బెదిరించాడని తెలిపాడు. దీనిపై అప్పట్లో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇరువురిని పిలిపించి మాట్లాడారని తెలిపాడు. కానీ అల్లడి ప్రసాద్‌ ఖాళీ చేయాలని మరలా బెదిరిస్తూనే ఉన్నాడని ఫిర్యాదులో తెలిపాడు.

● ఆదివారం అర్థరాత్రి సమయంలో సుమారు 50 మంది వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఆసుపత్రిపై దాడిచేసి ఆసుపత్రిలో కనిపించిన వస్తువులను పగలగొట్టి, ఆపరేషన్‌ థియేటర్‌, ఇతర స్కానింగ్‌ పరికరాలు, డాక్టర్‌ చాంబర్‌ తదితరాలను ధ్వంసం చేశారని తెలిపారు. సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌లు సైతం పీకేసి తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వ్యక్తులు ఆసుపత్రిలో తన చాంబర్‌లో ఉన్న రూ 5 లక్షల నగదును, ఆసుపత్రిలోని సుమారు రూ.80 లక్షల వరకు విలువ చేసే వస్తువులను లారీలపై వేసుకుని దోచుకు వెళ్ళారని ఫిర్యాదు చేశారు. గండ్రగొడ్డళ్ళు, మారణాయుధాలతో దాడిచేసి ఆసుపత్రిలోని రోగులను సైతం భయబ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని సైతం అల్లడి ప్రసాద్‌, అతని అనుచరులు అల్లడి అనిల్‌కుమార్‌, వెంకటేశ్వర్లు తదితరులు దాడిచేసి వెంటనే ఖాళీ చేయాలని మారణాయుధాలతో బెదిరించాడని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా అల్లడి అనిల్‌కుమార్‌ను, వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులనుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుని తన ఆసుపత్రిని, తనను రక్షించాలని వైద్యుడు కోరాడు. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గతంలో పలుమార్లు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితులు జనసేన నాయకులు కావటంతో పోలీసులు సైతం పట్టించుకోవటంలేదని బాధితుడు వాపోయాడు. నిందితులనుంచి తమ సిబ్బందికి, తనకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్‌కు, ఐజీ, డీజీపీ కార్యాలయాలకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement