అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలి

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 164 అర్జీలు నమోదయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. తన పరిధిలో ఉన్న వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కారమార్గం చూపగా, కొన్నింటిని పరిశీలనకు, మరికొన్నిటిని విచారణకు ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి అధికారులు తమ వంతుగా బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. మూస పద్ధతిలో విధులు నిర్వహించడం మాని సృజనాత్మకతతో పనిచేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన ప్రతి అర్జీని పరిశీలించి, పరిష్కరించాలన్నారు.

బాపట్ల జిల్లాలో అడ్వెంచర్స్‌ స్పోర్డ్స్‌

అడ్వెంచర్స్‌ స్పోర్డ్స్‌ బాపట్ల జిల్లాలో ప్రారంభించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతోందని కలెక్టర్‌ అన్నారు. పర్యాటక రంగంగా ప్రాచుర్యంలోకి బాపట్ల జిల్లా చరిత్ర మారిన రోజుగా ఆయన అభివర్ణించారు. ఈ విజయం ఏ ఒక్కరిది కాదని, జిల్లా యంత్రాంగమంతా కలిసి పనిచేయడం ద్వారా సాధ్యమైందన్నారు. అధికారులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సూర్యలంక బీచ్‌లోను అడ్వెంచర్‌ స్పోర్డ్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అభివృద్ధి చేసిన ఈ ప్రాంతంలో పర్యాటకుల సంరక్షణ కోసం 13 మంది జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. స్థానిక మత్స్యకారులకు ఉద్యోగాలు కల్పించే అంశంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీచ్‌ వద్ద పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థంగా ఉండాలన్నారు. బాపట్ల, చీరాల, వేటపాలెం బీచ్‌ లలో ప్రత్యేక పారిశుద్ధ్య సమావేశాలు నిర్వహించాలని డీపీఓను ఆదేశించారు. బీచ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రాంతాలలో ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలు చేయాలన్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌ పదార్థాలను నియంత్రించాలన్నారు. జనపనార సంచులు తయారీపై పొదుపు మహిళలకు శిక్షణ ఇచ్చి, యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నారు. బీచ్‌లలో సర్వే ల్యాండ్స్‌ అధికారులు సమగ్రంగా సర్వేలు చేయాలన్నారు. సీఆర్‌ జెడ్‌ భూములు, ప్రభుత్వ భూములు, పట్టా భూములకు స్పష్టంగా హద్దులు నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, కలెక్టర్‌ లవన్న, డీపీఓ ప్రభాకరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement