రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్
ఏడీ జ్ఞానసుందరం
చీరాల: అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.జ్ఞానసుందరం పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక ఐటీసీ కంపెనీలో అగ్ని ప్రమాదాల నివారణపై జరిగిన వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలను వర్క్‌షాపులో వివరించారు. గృహాలు, పరిశ్రమలు, పెట్రోలు బంకులు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లలో అగ్ని నిరోధకాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యుత్, గ్యాస్ కారణంగా సంభవించే ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోందన్నారు. తమ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా అందుబాటులో ఉన్న అగ్ని నిరోధకాలతో మంటలు అదుపు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక పరికరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ కేఎన్‌రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, చీరాల సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ, ఐటీసీ జీఎం శ్యామ్‌సుందర్, ఈహెచ్‌ఎస్ సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎన్ రెడ్డి, జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.


