ఎనిమిది సెల్‌ఫోన్‌లు స్వాధీనం రూ.3.61లక్షలు ఫ్రీజ్
తెనాలి రూరల్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల ఖాతాల్లోని రూ.3.61 లక్షలను ఫ్రీజ్ చేయించారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని పాఠశాల సమీపంలో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఎస్‌ఐ ఎన్‌సీ ప్రసాద్‌కు ఆదివారం వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇద్దరు ప్రధాన నిర్వాహకులతోపాటు బెట్టింగ్‌లో పాల్గొన్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ప్రధాన సూత్రధారి ఆన్‌లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ లింక్‌ను అత్తోటలోని వ్యక్తులకు పంపి ఐడీ, పాస్‌వర్డ్ చెప్పేవాడు. దాని ఆధారంగా లాగిన్ అయి బెట్టింగ్‌కు పాల్పడుతున్నా రు.ప్రధాన సూత్రధారి మినహా మిగిలిన నిందితులను అత్తోట గ్రామానికి చెందిన బొల్లిముంత అవి నాష్, యర్రు ప్రవీణ్, దాసరి రమేష్, బొల్లిముంత రమేష్, బొల్లిముంత శంతన్, బొల్లిముంత ఉమామహేశ్వరరావులుగా గుర్తించారు. నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరి ఖాతా ల్లోని నగదును ఫ్రీజ్ చేయించినట్టు డీఎస్పీ తెలిపారు.


