బాపట్ల: వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ విద్యలోనూ, ఉన్నత విలువల సాధనలోను అకుంఠిత దీక్షతో పోరాడి సమానత్వ భావన కోసం విశేషంగా కృషి చేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడని వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కోన భవనంలో ఆదివారం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలోను, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలోను చురుకుగా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన జగ్జీవన్‌రామ్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్‌లో కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా వ్యవసాయాన్ని ఆధునికీకరించడంలో ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనదని, భారత దేశంలో హరిత విప్లవ సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. 1974లో కరువు సంభవించినప్పుడు ఆహార ధాన్యాల కొరతను నివారించడం కోసం ఆయన అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించి, ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి రైతాంగం మన్ననలు పొందారన్నారు. తొలుత జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
జగ్జీవన్‌రామ్ జీవితం యువతకు ఆదర్శం
బాపట్లటౌన్: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అణగారిన వర్గాలు వివక్షకు గురౌతున్న తరుణంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిస్వార్థ పోరాటాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు తన వంతు కృషి చేశారన్నారు. అలాంటి గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడుని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆదర్శనీయమైన మహోన్నత వ్యక్తి నుంచి సద్గుణాలను అలవర్చుకుని సమాజం కోసం మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బి సీఐ బి.నారాయణ, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, సీసీ హరికృష్ణ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జ్జీవన్‌రామ్
బాపట్లటౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన ఘనుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని బాపట్లలోని ఎంపీ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ యువతరం జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పటాన్ రాజేష్, భోగిరి రామారావు, నర్రా ఏడుకొండలు, బడుగు పృధ్వీరాజ్, ఆర్ నాగేశ్వరావు, నీలాంబరం, బోగిరి పృధ్వీరాజ్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి


