రైతులకు మోంథా గుబులు
తుపాను ప్రభావంతో నేలవాలిన వరి పంట నష్టంపై అన్నదాతలకు తీవ్ర ఆందోళన పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలు తరలింపు
కొల్లూరు: మోంథా తుపాను రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత అధికమైంది. సుమారు 700 ఎకరాలలో వరి పంట నేలవాలి అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని క్రాప, కొల్లూరు, బొద్దులూరుపాడు, అనంతవరం, చిలుమూరు, ఈపూరు, దోనేపూడి, రావికంపాడు, చినపులివర్రు, తాడిగిరిపాడు గ్రామాల పరిధిలో పంట నీటిలో నానుతోంది. గాలుల తీవ్రత పెరిగితే కృష్ణా నది తీర గ్రామాలలో సాగులో ఉన్న అరటి, తమలపాకు, మినుము, కూరగాయల పంటలు, మండలంలోని 10,500 ఎకరాలలోని వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ముప్పు పొంచి ఉంది. మండలంలో 20 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొల్లూరు బాలికోన్నత పాఠశాల, రావికంపాడు పునరావాస కేంద్రాలలో కొల్లూరు స్నానాలరేవు, ఈపూరు కాలువ కట్ట, ఇందిరానగర్ కాలనీ, రావికంపాడు ఎస్సీ కాలనీ వాసులు 139 మంది తలదాచుకున్నారు.
వరి రైతులకు తీవ్ర నష్టం
బాపట్ల టౌన్: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.16 లక్షల ఎకరాల సాగు చేశారు. ఇందులో వేమూరు నియోజకవర్గంలో 95 వేల ఎకరాలు సాగైంది. ప్రస్తుతం 5 వేల ఎకరాల మేరకు కోతకు సిద్ధంగా ఉంది. నవంబర్ 15వ తేదీ తర్వాత కోతలు ముమ్మరంగా జరగనున్నాయి. ప్రస్తుతం కోతకు సిద్ధమైన పైర్లు నేలవాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నాట్లు వేసే సమయంలో వచ్చిన వర్షాలకు తొలుత మొత్తం మునిగిపోయాయి. అధిక రేట్లకు నారు కొనుగోలు చేసి రెండోసారి నాట్లు వేశారు. మళ్లీ 20 రోజులకే మరోసారి వర్షాలు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి.
రైతులకు మోంథా గుబులు
రైతులకు మోంథా గుబులు


