
జిల్లా భద్రతా విభాగం పోలీసుల మాక్ డ్రిల్
తాడికొండ: తుళ్ళూరు మండలంలో భద్రతా పోలీసు విభాగం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో డీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఐ సురేష్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించిన ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది తమవద్ద ఉన్న అత్యాధునిక సాంకేతిక పరికరాలు, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు తనిఖీలు నిర్వహించారు. కచ్చితత్వాన్ని పరీక్షించి జాగిలాల పనితీరును అంచనా వేసేందుకు సీడ్ యాక్సిస్ రోడ్డులో ఓ చోట పేలుడు పదార్థం గోప్యంగా పెట్టారు. బాంబు డిస్పోజల్ విభాగానికి చెందిన జాగిలం దాన్ని కనిపెట్టింది. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ.. వీవీఐపీలు ప్రయాణించే సీడ్ యాక్సిస్ రోడ్డులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి నిర్మాణ పనులకు వచ్చిన కార్మికుల వివరాలను సేకరిస్తున్నామని, భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుళ్ళూరు సీఐ కొంకా శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ విభాగం శ్రీహరి, జిల్లా భద్రతా విభాగం ఆర్‌ఐ సురేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.