వృషభ రాశి: నిబద్ధతతో విజయాలు.. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం | Vrishabha Rashi Ugadi Rashi Phalalu 2026-27 In Telugu, Know Your Sri Parabhava Nama Samvatsara Vrishabha Rashi Astrology Predictions | Sakshi
Sakshi News home page

Vrishabha Rashi Predictions: నిబద్ధతతో విజయాలు.. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం

Mar 18 2026 6:10 AM | Updated on Mar 18 2026 11:34 AM

Vrishabha Rashi-Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం–5, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–4
కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) 
రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)

Vrishabha Rashi Ugadi Rashi Phalalu 2026-2027: నిబద్ధతతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి ధర్మ కార్యాచరణ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి వార్తలు సంతోషం కలిగిస్తాయి. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయ వ్యయాలను అదుపులోకి తెచ్చుకుంటారు. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, అలంకరణ వస్తువుల కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఫైనాన్స్‌ వాప్యారులు లాభాలు అందుకుంటారు. సకాలంలో ఋణాలు దొరుకుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యకలాపాలలో తెలివిగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్‌ ఉద్యోగులు మంచి లాభాలు పొందుతారు. 

ఉద్యోగ వ్యవహారాలలో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో వ్యవహరించి ఊహకు అందని లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలతో కూడిన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు శ్రమతో లాభాలు పొందుతారు. అధికారుల నుంచి సహకారం తక్కువ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సహకారం అందుతుంది. షేర్‌ వ్యాపారులకు దినదినాభివృద్ధిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాలు ఏదో రీతిలో పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు సమర్థతకు తగిన గుర్తింపు వస్తుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలకు గ్రహానుగ్రహం బాగుంది. 

కృత్తిక  2, 3, 4: ఎన్నో విజయాలు సాధిస్తారు. నరఘోష తరచుగా అనుభవిస్తారు. బంధువులతో పొరపొచ్చాలు ఎదురు కావచ్చు. మాటతీరు నియంత్రించుకోవడం లాభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు బాగుంటాయి.

రోహిణి: వృత్తిరీత్యా దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్య వంతులైన కుటుంబసభ్యులకు కావలసిన వసతులు సమకూరుస్తారు. ఏదో తెలియని మానసిక చికాకులు వెంటాడుతుంటాయి. బంధుమిత్రుల ద్వారా నరఘోషకు గురవుతారు.

మృగశిర 1, 2: ఆటంకాలు ఎదురైనా, ప్రారంభించిన ప్రతిపనిలోనూ విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరించడం, పిల్లల వలన శుభ పరిణామాలు, కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. 

శాంతి మార్గం : రోజూ గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయడం శుభప్రదం. దక్షిణామూర్తి స్తోత్రం రోజూ పారాయణ చేయడం ద్వారా విజయశాతం పెరుగుతుంది. అక్టోబర్‌లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలతో పాటు తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన, సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. 

ఏప్రిల్‌: ఉద్యోగ, వ్యాపారాలలో అంతా సానుకూలం. కుటుంబంలో చికాకులు వస్తాయి. తెలివిగా సరిచేస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తపడతారు. తరచు మానసిక ఒత్తిడి ఉంటుంది. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. విజయాలు సాధించి, గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వాహనాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. మే: వాతావరణ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. భవిష్యత్‌ కార్యాచరణ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15వ తేదీ తరువాత పనులు వేగంగా చేయలేని పరిస్థితి ఉంటుంది. వద్దు అనుకుంటూనే అనేక ప్రయాణాలు చేస్తారు. స్నేహితులు, బంధువులతో వ్యవహార సమస్యలు సానుకూలం కాగలవు. జూన్‌: చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. సంబంధం లేని సమస్యలు రాగలవు. రోజువారీ పనులు కూడా సరిగా చేయలేరు. ఇతరుల వ్యవహారములలో కలుగచేసుకోవద్దు. ఆరోగ్య, ఋణ, కలహ విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుతుంది. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కవవుతాయి. ముఖ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని వ్యవహారాలలోను మంచి సలహాలు పొందుతారు. జులై: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులు తమ ఆలోచనలను అమలు చేయగలుగుతారు. ఒక్కోసారి పెంపుడు జంతువుల సేవల కోసం ముఖ్యమైన పనులు ఆలస్యం చేస్తుంటారు. ఆగస్ట్‌: పనులు వేగంగా సాగినా, శ్రమాధిక్యం ఉంటుంది. వాహన, యంత్రాల మరమ్మతులకు అధిక వ్యయం జరుగుతుంది. పుణ్య, శుభకార్యాలలో బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం సమస్యల విషయంలో వైద్యులను కలవడం శ్రేయస్కరం. గృహోపకరణాల కొనుగోలుకు ధనవ్యయం అవుతుంది. కోర్టు, ఇతర వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి.

 సెప్టెంబర్‌: తరచు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అంతా శుభప్రదం. దూర ప్రయాణాలు చేస్తారు. ఋణాలు తీర్చేందుకు అవకాశాలు ఉండవు. ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మార్కెటింగ్‌ ఉద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ప్రతిరోజూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. 

అక్టోబర్‌: కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. వాహనాలు అలంకరణ వస్తువుల కొనుగోలు గురించి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. అధికారుల సహకారం బాగా ఉంటుంది. చదువు బాగా సాగుతుంది. మీ తెలివిని అందరూ గుర్తిస్తారు. 

నవంబర్‌: పెద్దల ఆరోగ్య విషయంగానూ, పిల్లల అభివృద్ధి విషయంలోనూ అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో  మొండిగా ఉంటారు. కోపావేశాలు నియంత్రించుకోవాలి. అవయవ ప్రతికూలతలు ఉంటాయి. వైద్యపరంగా అనవసర ఖర్చు ఉంటుంది. బంధుమిత్రులతో పాత విషయములలో కలహములు రాగలవు. పిల్లల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ ఉంచండి. 

డిసెంబర్‌: మామూలు పనులు కూడా ఒత్తిడితో పూర్తవుతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు స్వయంగా చేసుకుంటే వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఋణాలను సకాలంలో చెల్లించకుంటే, ఇబ్బందులు తప్పవు. తరచు తలెత్తే అజీర్ణ సమస్యలు భయం కలిగిస్తాయి. 

జనవరి: నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. దూర ప్రయాణాలను విరమించండి. కుటుంబ, వృత్తి విషయాలకు సమయం సమతూకంగా కేటాయించలేక ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఋణ సౌకర్యం బాగానే ఉంటుంది కాని, అది పొందకపోవడం భవిష్యత్‌కు మంచిది. 

ఫిబ్రవరి: తరచుగా భోజన సౌకర్యం లోపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనవసరంగా అధికారుల నుంచి, తోటివారి నుంచి మాట పడతారు. ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. సమయపాలన లోపించి, పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు ఎదురు కాకుండా వ్యవహరించండి. 

మార్చి: అప్రయత్నంగా కొన్ని వ్యవహారములు సానుకూలం అవుతాయి. ఉద్యోగాలలో పనులు తెలివిగా చేస్తారు. ఎంతో శ్రమతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అన్ని విషయాలలో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. అనవసర కాలక్షేపాలు చేయరు. కుటుంబ, వృత్తి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చిన వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యా వ్యాసంగంలో వారికి కాలం అనుకూలం.

 

Advertisement
 
Advertisement
Advertisement