Maddi Anjaneya Swamy Temple History: కుడి చేతిలో గద, ఎడమ చేతిలో ‘అరటిపండు’.. 

Famous Hanuman Temple At Jangareddy Gudem In West Godavari - Sakshi

జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం. తెల్ల మద్ది చెట్టే శిఖరం. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామిహనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం. స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర. భక్తుల పాలిట కొంగుబంగారం మద్ది హనుమ. 

మద్ది అంజన్న దర్శనం తోనే జన్మ లగ్నాత్‌ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక. మంగళవారం, శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం. మూడు యుగాలతో ముడిపడిన స్థలపురాణం. గర్గ సంహిత, శ్రీమద్‌ రామాయణం, పద్మ పురాణంలో స్థలపురాణ అంశాలు. భక్తుడి దివ్యకధకు రూపం. భక్తవరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగుబంగారం.

ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు తో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీమద్దిఆంజనేయస్వామి వారి ఆలయం. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం (తెల్లమద్ది చెట్టు) తొర్రలో కొలువైఉన్న ఆంజనేయస్వామివారి సన్నిధి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దివ్యాలయం.

ఆలయానికి వెళ్లే మార్గం :
పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గం లో 48 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి  4 (నాలుగు)కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

ఆలయం తెరుచు వేళలు:
 ప్రతీ రోజూ ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తిరిగి మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:30 వరకు, ప్రతీ మంగళవారం మాత్రం వేకువజామున 5:00 గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది

స్థలపురాణం :
ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబందంగా స్థలపురాణం చెప్పబడింది

త్రేతాయుగం:
రావణుని సైన్యంలోని మద్వా సురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సు చలించి అస్త్రసన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు.

ద్వాపరయుగంలో :
 ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జనుని రధం పైనున్న ’జండా పై కపిరాజు’ (ఆంజనేయస్వామి వారు)ను దర్శించి తన గతజన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు.

 కలియుగంలో :
కలిలో మద్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు  రోజూ లాగునే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినవుడు, ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది.

తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతీ రోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మద్వమహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్లు మీతో సపర్యలు చేయించుకున్నానా ! అని నేను పాపాత్ముడను, జీవించి ఉండుట అనవసరం అని విలపించి  బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.

వరప్రదానం :–
మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మద్వమహర్షి కోరగా మద్వా నీవు అర్జున వృక్షానివై (తెల్లమద్దిచెట్టు)ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను.నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మద్ది ఆంజనేయుడుగా కొలువైవుంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు అన్నది స్థలపురాణం.

స్వప్నదర్శనం:
అనంతర కాలంలో 1966 నవంబర్‌ 1న ఒక భక్తురాలికి స్వప్నదర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేసినా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్నవృత్తాంతం. 

చిన్నగా గర్భాలయం:
ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. మద్ది ఒక దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.

హనుమద్‌ దీక్షలు:
ప్రతీ సంవత్సరం భక్తులు హనుమద్‌ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమద్‌ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు.ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు.మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠితమూర్తులను భక్తులు దర్శించవచ్చు.  

ప్రదక్షిణలు:
స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు,వైవాహిక బంధం లో ఇబ్బందులు ఉన్నవారు,ఆర్ధిక ఇబ్బందులు,వ్యాపారం లో నష్టాలు,ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చకస్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం.

శనిదోషాలు,గ్రహదోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలు తో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మిక.

ఆధ్యాత్మిక వైభవం :–
సువర్చలా హనుమ కల్యాణం ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు, పంచామృతాభిషేకం ప్రతీ శనివారం, 108 బంగారు తామలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో,  108 వెండి తమలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, ఇంకా నిత్యపూజలు, విశేష పర్వదినాల్లో ప్రత్యేకపూజలు, అష్టోత్తర సేవ జరుగుతాయి.

కార్తీకమాసంలో నెలరోజులూ వైభవమే:
కార్తిక శుద్ధ పాడ్యమి నుండి కార్తిక అమావాస్య వరకూ కార్తికం లో ప్రతీ మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చూసి తరించవలసిందే వర్ణించ వీలుకాని వైభవం. అలాగే హనుమద్జయంతి 5 రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకూ జరుగుతుండగా, పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతీదీ ప్రత్యేకమే.
 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top