 
															మోంథా ప్రభావం... తెగుళ్లతో జరభద్రం
● మోంథా నుంచి కోలుకుంటున్న రైతులు
● మెలకువలను పాటించాలంటున్న
శాస్త్రవేత్తలు
కడప అగ్రికల్చర్ : మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం.. నెమ్ము చేరడంతో పంటలు వాడుముఖం పట్టడం తెగుళ్ల బారిన పడడం జరుగుతోంది. వరితోపాటు, మినుము, వేరుశనగ, పత్తి, శనగ రైతులకు ఈ నష్టం తప్పనిసరి. ఇప్పటికే చాలా పంటలు నీటమునిగాయి. రైతులకు ఉపశమనం కలిగించేందుకు కొన్ని మెలకువలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
వరి పంట...
కోత దశలో పడిపోయిన, నిలిచిన పైరు, కంకిలో మొలకలు కనపడితే పొలం నుంచి నీరు తీసేసి 50 గ్రాముల కల్లు ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నూర్పిడి చేసిన ధాన్యం రెండు, మూడు రోజుల పాటు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజలు మొలకెత్తకుండా క్వింటా ధాన్యానికి కిలో కల్లు ఉప్పు, 20 కిలోల వరిపొట్టు కలపాలి. పైరు నిలబడి ఉన్నా, పడిపోయిన చేలలో గింజలు రంగు మారకముందే పొట్టకుళ్లు, పాముపొడ, మానిపండు తెగుళ్లు రాకుండా ఎకరాకు 200 మి.మీటర్ల ప్రొపిపకోనోజోల్ మందు పిచికారీ చేయాలి. పిలకల దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైరులో ఆకుముడత, కాండం తొలుచు పురుగు, సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. వాటి నివారణకు ఎకరాకు ప్లూబెండమైడ్ 50మి.మీ, గ్రాము పైమెట్రిజిన్‌తో కలిపి పిచికారీ చేసుకోవాలి
మినుము
పొలంలో నిలిచిన నీటిని పిల్ల కాల్వల ద్వారా తీసివేయాలి. వేరుకుళ్లు, చిత్తపురుగులు, లద్దెపురుగు నివారణకు 400 మి.మీ అసిఫేట్, హెక్సాకోనజోల్, వేయి గ్రాముల 19:19:19 మందు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.
వేరుశనగ
పైరు తొలిదశలో ఉన్నప్పుడు మొదలుకుళ్లు, ఆకుమచ్చ తెలుగు ఆశించాయి. నివారణకు కార్బండిజమ్, మాంకోజెబ్ 500 గ్రాములు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగు ఆశించినప్పుడు ఇమామెక్టిన్ జెంబేమేట్ 80 గ్రాములు ఎకరాకు పిచికారీ చేయాలి. కోత దశలో ఉన్న పైరులో వర్షం తగ్గిన తరువాత నీటిని తీసివేయాలి.
పత్తి
పైరులో నిలిచిన నీటిని తీసేసి ఎకరాకు 40 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. గులాబీరంగు పురుగు, కాయకుళ్లు నివారణకు క్లోరాన్‌ట్రానిక్‌ప్కొల్ 60మి.మీ, హెక్సాకోనజోల్ 400మి.మీ, 13:0:45 వేయి గ్రాములు కలిపి ఎకరా పంటకు పిచికారీ చేయాలి.
శనగ
తొలిదశలో ఉన్న శనగ పంట వేరుకుళ్లుతో చనిపోతోంది. నివాణరకు హెక్సాకొనాజోల్ 400 మి.మీ ఎకరాకు కలిపి పిచికారీ చేయాలి.
కంది
ప్రస్తుతం కంది పంట శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది. పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. వర్షాలు ఆగాయి కాబట్టి పొటాషియం నైట్రేట్, 19:19:19 ఎరువు 1.0% (10 గ్రా. లీటర్ నీటికి) పిచికారీ చేయాలి. పొడలు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణకు, కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రామాలు లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా నేలపై పిచికారీ(డ్రెంచింగ్) చేయాలి. వర్షాలు ఆగిన తరువాత, మరూక, శెనగపచ్చ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, నోవాల్యూరోన్ 1.0 మి.లీ, స్పైనోసాడ్ 0.3 మి.లీ కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
