పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

Oct 31 2025 7:43 AM | Updated on Oct 31 2025 7:43 AM

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

సిద్దవటం : మాధవరం–1 గ్రామ పంచాయతీ కార్యదర్శిపై అదే గ్రామానికి చెందిన పాటూరు గంగిరెడ్డి ఈవోపీఆర్‌డీ మెహెతాబ్‌యాస్మిన్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. గండిరెడ్డి మాట్లాడుతూ 2024 సెప్టెంబర్‌, 9న 892/3 సర్వే నెంబర్‌లో 0.03 సెంట్ల ఇంటి స్థలానికి రెవెన్యూ అధికారులు పొజిషన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం జరిగిందన్నారు. తనకు కేటాయించిన స్థలంలో అదే గ్రామానికి చెందిన బొడ్డుబోయిన నారాయణ, ఇప్పట పాటి సుజాత రేకుల షెడ్డు నిర్మించుకున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఎలాంటి విచారణ లేకుండా ఎన్‌ఓసీ జారీచేశారన్నారు. సదరు వ్యక్తి ఎన్‌ఓసీతో కరెంట్‌ మీటర్‌ దరఖాస్తు చేసుకున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

పోలీస్‌ కస్టడీలోకి రిమాండ్‌ ఖైదీలు

పెద్దతిప్పసముద్రం : చోరీ కేసుల్లో పట్టుబడి మదనపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు రిమాండ్‌ ఖైదీలను కస్టడీలోకి తీసుకునేందుకు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌కు తంబళ్లపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్డి అనుమతి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా పాణ్యం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న దాసరి అంకన్న (37), సత్యహరిశ్చంద్రుడు (32), బాపట్ల చిన్నహుసేని (30), చెంచు దాసరి (35) తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి బంగారం, నగదు అపహరించిన నిందితులు గతంలో పలు చోరీ కేసుల్లో పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు అనంతరం వీరంతా మదనపల్లి సబ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల నేపథ్యంలో విచారణలో భాగంగా రిమాండ్‌ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ గురువారం వెళ్లడించారు.

రోడ్డు ప్రమాదంలో

దంపతులకు గాయాలు

మైదుకూరు : మండలంలోపి తిప్పిరెడ్డిపల్లె కొత్తపల్లె సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపాళెం మండల కేంద్రానికి చెందిన భార్యా భర్తలు గాయపడ్డారు. రాజుపాళెం గ్రామానికి చెందిన దాసరి జయరాములు, నాగమునెమ్మ దంపతులు బ్రహ్మంగారిమఠం వెళ్లి స్వామి దర్శనానంతరం తిరిగి మోటార్‌ బైక్‌పై గ్రామానికి బయల్దేరారు. టి.కొత్తపల్లె సమీపంలో మైదుకూరు – తాడిచర్ల రహదారిపై బైక్‌ బోల్తా పడడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైదుకూరు – తాడిచెర్ల రోడ్డు నిర్మాణంలో ఉండడంతో ప్రమాదం జరిగిన చోట రహదారి సక్రమంగా లేకపోవడంతోనే బాధితులు వస్తున్న బైక్‌ బోల్తా పడినట్లు తెలుస్తోంది. స్థానికులు జయరాములు, నాగమునెమ్మను చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

కమలాపురం : మండలంలోని అప్పారావుపల్లె గ్రామానికి చెందిన మూలవిశ్వనాథ్‌రెడ్డి(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామస్తుల సమాచారం మేరకు.. అన్నదమ్ములైన మూలచెన్నారెడ్డి, విశ్వనాథరెడ్డి ఘర్షణపడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యంతాగి ఉన్న విశ్వనాథరెడ్డి బైక్‌లో వెళ్తూ విద్యుత్‌ స్తంభానికి ఢీ కొన్నాడు. తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య భారతి, డిప్లమో చదువుతున్న కుమారుడు యశ్వంత్‌, టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న కుమార్తె జాహ్నవి ఉన్నారు. ఎస్‌ఐ విద్యా సాగర్‌ను వివరణ కోరగా విద్యుత్‌ స్థంబానికి బైక్‌ఢీ కొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు. విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement