
టీచర్ల సర్టిఫికెట్లలో వైకల్యం..!
● మూడు రోజుల పరిశీలనలో ‘గోల్‌మాల్’
● డాక్టర్ల క్లినిక్‌లకు వెళ్లి కొందరి బేరసారాలు
● ఒక్కో సర్టిఫికెట్‌కు
రూ.30 వేల వరకు వసూళ్లు
● తొలి రోజున నగదు రూపంలో
ఫీజుల వసూలు
● అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది బదిలీల కోసం ఏకంగా చట్టం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. దానికనుగుణంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రతి జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వతేదీ వరకు మూడు రోజుల పాటు బోధన, బోధనేతర సిబ్బందికి చెవుడు, మూగ, కుంటి, గుడ్డి, అంగ వికలత్వం, బుద్ది మాంద్యం, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బు, ఇలా వ్యాధులు కలిగిన సిబ్బంది లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు పునఃపరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా విభాగాల్లో నిష్ణాతులైన డాక్టర్లచే రిమ్స్ జనరల్ హాస్పిటల్‌తో వికలత్వ, వ్యాధి నిర్ధారణ పునఃపరీక్షలు రిమ్స్ సూపరిండెంట్ పర్యవేక్షణలో జరురగుతున్నాయి. వివిధ విభాగాలు డాక్టర్లు, అధికారులను, సిబ్బందిని ఇందుకోసం నియమించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ నెల 24న జరిగిన పరిశీలనలో చేయి తడపనిదే కొందరు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ముందుకు రాలేదనే విమర్శలున్నాయి. రిమ్స్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి కొందరు డాక్టర్లు, అటు టీచర్లను మేనేజ్ చేశారనే అరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి కోరుకున్నట్లు సర్టిఫికెట్లు జారీ చేసేశారు. కొందరు యూనియన్ లీడర్లు, మండల విద్యాధికారులతో రెండు రోజుల ముందుగానే సిబ్బంది టచ్‌లోకి వచ్చి సర్టిఫికెట్ల జారీపై చెప్పినట్లు సమాచారం.
ఒక్కో రేటుతో వసూళ్లు
వికలత్వానికి ఒక రేటు, వ్యాధులకు మరో రేటు నిర్ధారించి వసూలు చేసినట్లు సమాచారం. ఆఫీసులో పని చేసే పెద్దస్థాయి అధికారి, సంబంధిత సెక్షన్ అధికారులుచ, సిబ్బంది ఉపాధ్యాయుల యూనియన్ లీడర్లు, మండల అధికారులతోనూ లాలూచీ పడినట్లు సమాచారం. రిమ్స్ పరిపాలనా విభాగంలో పనిచేసేఆఫీస్ సిబ్బందిలో కొందరు ఈ వ్యవహారాన్ని సాగించారు. ఉపాధ్యాయుల స్థాయిని బట్టి రేటు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు తెరతీసిన పరిపాలనా సిబ్బంది పారదర్శకంగా వికలత్వ సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. బోగస్ వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ వ్యాధుల పేరున సర్టిఫికెట్‌ల ధృవీకరణ లేకుండా అధికారులు డాక్టర్లు వ్యవహరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఉపాధ్యాయుడు, వారి కుటుంబ సభ్యులచే రిమ్స్ హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరిట నిర్ధారణ పరీక్ష ఫీజు రూ.1000 చెల్లించాలని నిబంధన ఉండగా, ఈ డబ్బు బ్యాంకులో చెల్లించి రసీదు తీసుకువచ్చి వికలత్వ సర్టిఫికెట్‌కు జతచేసి, ఇస్తే డాక్టర్ పరిశీలించాల్సి వుంది. ఈ నిబంధనను తొలి రోజున తుంగలో తొక్కి డబ్బు తామే కట్టించుకున్నారు. కలెక్టర్, రిమ్స్ పరిపాలనాధికారులు ఇప్పటికై నా స్పందించి మిగిలిన రెండు రోజులైనా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తొలి రోజున 190 మందికి వికలత్వ పున:పరీక్షలు నిర్వహించారు. రిమ్స్ అధికారుల సూచన మేరకు రెండు రోజుల వికలత్వ సర్టిఫికెట్ల నిర్ధారణ పరీక్షల ఫీజు యూనియన్ నాయకులే వసూలు చేసి ‘ఆసుపత్రి అభివృద్ది కమిటీ’ ఖాతాలో ఎట్టకేలకు జమచేశారు.