
- 2 నెలల్లోనే దాదాపు 40 మందికి పైగా ఒకే విధంగా చనిపోయినా పట్టించుకోలేదు
- కలుషిత నీటిని తాగి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారు
- నీరు కలుషితమైందని కలెక్టర్‌కి నెల క్రితమే వైఎస్సార్‌సీపీఫిర్యాదు
- అయినా గ్రామాన్ని సందర్శించి రక్షణ చర్యలు చేపట్టలేదు
- వైఎస్సార్‌సీపీబృందం వస్తుందని తెలిసి ఎమ్మెల్యే, మంత్రి హడావుడి
- ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు
- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేయాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీనాయకులు
తురకపాలెం: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గడిచిన రెండు నెలలుగా జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాలతో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీఅధ్యక్షులు అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్సీపీకి చెందిన డాక్టర్లు, నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం తురకపాలెం గ్రామాన్ని సందర్శించింది.
గ్రామంలో మృతుల కుటుంబాలతో మాట్లాడి, మరణాలకు గల కారణాలపై వివరాలు సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాగునీరు కలుషితం అవ్వడం వల్లే గ్రామస్తులు అస్వస్తతకు గురై, మృత్యువాత పడుతున్నారని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం ప్రతినిధులు తెలిపారు.
నీరు కలుషితం అవుతోందని నెల రోజుల కిందటే వైఎస్సార్‌సీపీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గ్రామంలోని ప్రజలకు రక్తపరీక్షలు జరిపించాలని, అస్వస్తతకు గురైన వారికి గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే...
స్పెషలిస్ట్ డాక్టర్లను రప్పించాలి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో రెండు నెలలుగా దాదాపు 40 మందికి పైగా జ్వరం బారిన పడి అకస్మాత్తుగా చనిపోతున్నారు. మృతుల్లో 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు కూడా ఉండటం కలవరపరుస్తోంది. వైఎస్సార్‌సీపీ తరఫున మృతుల కుటుంబాలను సందర్శించి వారితో మాట్లాడటం జరిగింది. వైయస్సార్సీపీ తరఫున గ్రామాన్ని సందర్శించి దీనికి గల కారణాలపై అన్వేషణ చేస్తే గ్రామానికి సరైన మంచినీటి సదుపాయం లేదని అర్థమైంది. క్వారీ గుంతల్లో నుంచి పైపులైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకుకి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగిన వారే రోగాల బారిన పడి చనిపోతున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. గుంటూరు నగరానికి ఈ గ్రామం నుంచి రోజూ 45 లక్షల నీరు వెళ్తున్నా, వీరికి మాత్రం సురక్షితమైన మంచినీరు దొరకడం లేదు. మృతులకు చికిత్స చేసిన డాక్టర్లతో మాట్లాడితే మిలినియోసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని రిపోర్టులు ద్వారా తెలుస్తోందని చెప్పారు. అపరిశుభ్ర పరిసరాలు, వాతావరణం, తాగునీటి కారణంగానే ఈ బ్యాక్టిరియా వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది.
తక్షణమే ప్రభుత్వం ఓవర్‌హెడ్ ట్యాంక్ నీటి సరఫరాను ఆపేసి సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని వైఎస్సార్‌సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న క్యాంపుల వల్ల గ్రామానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీహెచ్ సీ డాక్టర్లతో ఏం ప్రయోజనం ఉండదు. మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావాలి. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఈ గ్రామస్తుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలి. సాధారణ మందుల ద్వారా ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమయ్యే పనికాదు. బాధితులకు మంచి మందులు తెప్పించి అందించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా గ్రామస్తులు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని మరిగించి తాగాలి. స్నానం చేసే నీటిలో కూడా డెటాల్ వేసుకోవాలి.
మైనింగ్ గుంతల్లో నీరు సరఫరా చేయడం వల్లే
సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి
గత రెండు నెలలుగా తురకపాలెం గ్రామంలో జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. జ్వరాల బారిన పడి వారం రోజుల్లోనే చనిపోతున్న ఘటనలు రెండు నెలలుగా జరుగుతున్నాదానికి కారణాలను ప్రభుత్వం ఇంతవరకు కనుక్కోలేకపోయింది. పీహెచ్‌సీ డాక్టర్లతో మాట్లాడితే శాంపిల్స్ పంపినా ఇంకా రిపోర్టులు రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీతరఫున గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను కలిసి వివరాలను సేకరించాం.
వారు చెప్పిన దాని ప్రకారం జ్వరం రావడం, నాలుగైదు రోజుల తర్వాత తగ్గడం మళ్లీ రావడం, ఒళ్లు నొప్పులు, కండరాలు నొప్పులు వేధిస్తున్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత తీవ్రమైన ఆయాసం, గుండెనొప్పి రావడంతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నట్టు తెలిసింది. ఏడెనిమిది మంది ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది జ్వరం తగ్గిందని ఇంటికొచ్చినా మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రికి వెళ్లేలోపే మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కాలువలు, వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
రెండు నెలలుగా గ్రామస్తులంతా అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల్లో జ్వరాల బారిన పడి చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి రక్షణ చర్యలు తీసుకోకపోతే మరణాలు మరిన్ని సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. గ్రామస్తులు కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. గ్రామం నుంచి రోజుకి 45 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడేసి అక్రమంగా సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మైనింగ్ గుంతల్లో నుంచి తోడిన నీటిని తాగడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీప్రభుత్వంలో మాదిరిగా విలేజ్ క్లీనిక్స్ అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం తక్షణం గ్రామస్తుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని కల్చర్ టెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీతరఫున డిమాండ్ చేస్తున్నాం.
జ్వరంతో మొదలై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చనిపోతున్నారు
డాక్టర్ అశోక్
తురకపాలెంలో వరుస మరణాలకు గల కారణాలను అన్వేషించడానికి వైఎస్సార్‌సీపీతరఫున గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చనిపోయిన ప్రతిఒక్కరూ జ్వరం, ఆయాసంతో బాధపడిన వారే. మృతులంతా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో వారం రోజుల్లోనే చనిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇక్కడ జరుగుతున్న మరణాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఈ గ్రామంలోని బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషాలిటీ మెడికల్ వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలి. గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. గ్రామంలో మట్టి, నీరు కలుషితం జరుగుతోందని గుర్తించాం. గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. పారిశుద్ధ్య పరిరక్షణ మీద కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
నెల క్రితమే కలెక్టర్‌కి వైఎస్సార్‌సీపీఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు
తురకపాలెంలో జరుగుతున్న మరణమృదంగంపై ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకే గ్రామంలో ఒకే రకమైన వ్యాధితో 40 మందికి పైగా చనిపోవడం మామూలు విషయం కాదు. వైఎస్సార్‌సీపీతరఫున మేము గ్రామానికి వస్తున్నామని తెలిశాకనే ప్రభుత్వం స్పందించింది. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో బోర్ల ద్వారా తోడిన నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకు సరఫరా చేస్తున్నారు.
గ్రామస్తులకు మాత్రం (సంజీవయ్య గుంట) నుంచి క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తించాం. ఈ గుంతల్లోకి నీరు కొండల్లో నుంచి వస్తుంది. ఆ నీటితోపాటు బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా కలిసి నీరు కలుషితమవుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టి పెట్టాలి. మేం గ్రామంల పర్యటిస్తే తప్ప ఆరోగ్యశాఖ మంత్రిలో కదలిక రాలేదు. అధికారుల మీద నిప్పులు చెరిగారని టీవీల్లో బ్రేకింగులు వేసుకుంటున్నారు. కలుషిత నీటి సరఫరా జరుగుతోందని నెల క్రితమే జిల్లా కలెక్టర్‌కి నెల రోజుల క్రితమే వైఎస్సార్‌సీపీతరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తక్షణమే గ్రామానికి ఆరోగ్యశాఖ మంత్రిని పంపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలి. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైయస్సార్సీపీ బృందం గ్రామంలో పర్యటించింది. మేం వస్తున్నామని తెలిసి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పర్యవేక్షణలో హడావుడిగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదని వారికి కూడా తెలుసు. గుంటూరు పక్కనే కూతవేటు దూరంలో తురకపాలెం గ్రామంలో రెండు నెలలుగా అకాల మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని దుస్థితికి ప్రభుత్వం సిగ్గుపడాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్‌సీపీపోరాడుతుంది. తురకపాలెం గ్రామ పరిస్థితులపై ప్రభుత్వం రిపోర్టు ఇవ్వాలి. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయాలి’ అని డిమాండ్ చేశారు.