నేటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

YSR Pension Kanuka From 1st October - Sakshi

60.80 లక్షల మంది పెన్షనర్లకు రూ.1,420.48 కోట్లు విడుదల

2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని 60.80 లక్షల మంది లబ్ధిదారులకు నేటి (శుక్రవారం) నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను పంపిణీ చేయనున్నామని.. ఇందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేసినట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీ తెల్లవారుజాము నుంచే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే పెన్షన్లను అందించాలన్న సీఎం జగన్‌ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసిందన్నారు. ఈ మేరకు రూ.1,420.48 కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఈ మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశామని.. వలంటీర్లు అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. 

బయోమెట్రిక్, ఐరిస్‌ విధానం అమలు
లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్‌ విధానాలను అమలుచేస్తున్నామని, అలాగే.. ఆర్‌బీఐఎస్‌ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని పెద్దిరెడ్డి తెలిపారు. ఎవరైనా తమ సొంత నివాసం నుండి ఇతర ప్రాంతాలకు వైద్యం లేదా ఇతర కారణాలతో ఆరు నెలలు  ఊరెళ్లిన వారికి కూడా, వారు ఉండే చోటే పెన్షన్‌ అందించే ఏర్పాట్లుచేసినట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతిక కారణాలవల్ల ఏ ఒక్కరికీ పెన్షన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్‌ పంపిణీని మూడ్రోజుల్లో నూరుశాతం పూర్తయ్యేలా వలంటీర్లను ఆదేశించామన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top