పరిశ్రమల భూములు అమ్ముతాం.. | You can pay the land price to APIIC and do real estate business on that land | Sakshi
Sakshi News home page

పరిశ్రమల భూములు అమ్ముతాం..

Apr 17 2026 5:14 AM | Updated on Apr 17 2026 5:14 AM

You can pay the land price to APIIC and do real estate business on that land

పూర్తిస్థాయి హక్కులతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఇస్తాం

పారిశ్రామిక పార్కుల్లో గృహాలు కట్టి విక్రయించుకోండి

ప్రతీ జిల్లా కేంద్రంలో వాణిజ్య సముదాయాలు కట్టుకోండి

ఇందుకోసం జోన్‌ ఆఫీసులు, పార్కుల్లో ఎకరం వరకు ఇస్తాం

అభివృద్ధి చేసిన స్థలంలో ఏపీఐఐసీకి 10,000 చదరపు అడుగులు ఇవ్వాలి

ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించిన ఏపీఐఐసీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ)ని చంద్రబాబు సర్కారు పూర్తి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకింగ్‌ సంస్థగా మార్చేశారు. ఇప్పటికే పీపీపీ విధానంలో రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను, ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్‌ హబ్స్‌ (లిఫ్ట్‌) పాలసీ పేరిట విశాఖలోని రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు అతిచవకగా కట్టబెట్టిన ప్రభుత్వం..  తాజాగా తాను అభివృద్ధి చేసిన పార్కులు, వాణిజ్య సముదాయాల్లోని స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఏపీఐఐసీ ద్వారా అమ్మేస్తోంది. 

రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక పార్కుల్లో అందుబాటు ధరల్లో గృహ సముదాయాలు నిర్మించడానికి పూర్తిస్థాయి అమ్మకపు హక్కులతో అప్పగించనుంది. కేటాయించిన స్థలంలో 60 శాతం గృహ అవసరాలకు వినియోగించి మిగిలిన 40 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగంచుకోవడమే కాక, చార్జీలు వసూలు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందడానికి అనుమతించింది. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. 

బిడ్‌ గెలిచిన సంస్థ ఏపీఐఐసీకి భూమి ధరను చెల్లించి ఆ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్టు డిజైన్, నిధుల సమీకరణ, నిర్వహణ అంతా గెలిచిన బిడ్డింగ్‌ సంస్థే  చూసు­కోవా­లని, ప్రభు­త్వం నుంచి అవసరమైన అనుమ­తులను మంజూరు చేయడంలో మా­త్రమే ఏపీఐఐసీ సహా­యం అందిస్తుందని ఆ టెండర్‌ డాక్యుమెంట్స్‌లో పేర్కొన్నారు. 

జిల్లా కేంద్రాల్లో వాణిజ్య సముదాయాలు
ఇవేకాకుండా నగరం నడిబొడ్డున ఉన్న జోనల్‌ కార్యాల­ యాలు, లేదా పారిశ్రామిక పార్కుల్లో వాణిజ్య సముదాయాలను ఏర్పాటుచేయడానికి ప్రైవేటు సంస్థలకు ఏపీఐఐసీ భూములను కేటాయిస్తోంది. ఇందుకోసం విలువైన భూముల్లో సుమారుగా ఒక ఎకరం స్థలాన్ని కేటాయించనుంది. ఈ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనుంది. అలాగే, అభివృద్ధి చేసిన స్థలంలో ఏపీఐఐసీకి 10,000 చదరపు అడుగులు ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇక మిగిలిన ఆదాయమంతా ఆ బిల్డరే తీసుకోవచ్చని టెండరు డాక్యుమెంట్లలో పేర్కొన్నా­రు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల స్థలాలను కేటాయించనున్నారు. ఇందులో అత్యధికంగా జోనల్‌ ఆఫీసు కార్యాలయాలు ఉండగా మరికొన్ని చోట్ల ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఇతర పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ఈ 27 చోట్ల వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థ నుంచి బిడ్లను ఆహ్వానించింది.  

Advertisement
 
Advertisement
Advertisement