లేటరైట్‌ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్‌

Visakha Collector who examined the laterite hills - Sakshi

జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు అందిన ఫిర్యాదుపై క్షేత్రస్థ్ధాయి పరిశీలన 

నాతవరం: విశాఖ జిల్లాలో లేటరైట్‌ నిక్షేపాలున్న కొండలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం పరిశీలించారు. నాతవరం మండలంలో సుందరకోట శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో లేటరైట్‌ తవ్వకాల కోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేశారని గునుపూడికి చెందిన కె.మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో కలెక్టర్‌ లేటరైట్‌ నిక్షేపాలున్న కొండలను సందర్శించారు. కొండపైకి కారు వెళ్లే అవకాశం లేదు. దీంతో జీపులో, ద్విచక్రవాహనంపై కొంత దూరం ప్రయాణించి, సుమారు రెండు కిలోమీటర్లు నడిచి కొండలను చేరుకున్నారు. అటవీ, రెవెన్యూ భూములు, వాటి సరిహద్దుల మ్యాప్‌లను తహసీల్దార్‌ జానకమ్మ వివరించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు.

ఫిర్యాదీ మరిడయ్యతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న విషయాలకు, క్షేత్రస్థ్ధాయిలో కనిపిస్తున్న దానికి పొంతన లేకపోవడం, భారీ వృక్షాలు లేకపోవడంపై ఫిర్యాదీని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ లేటరైట్‌ తవ్వకాల కోసం వేసిన రోడ్లను పరిశీలించామని చెప్పారు. నిబంధనలను పాటించారా లేదా అన్న విషయంపై అటవీ, మైనింగ్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కలెక్టర్‌తోపాటు జేసీ వేణుగోపాలరెడ్డి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్‌బాబు, ఇతర అధికారులు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top