థర్డ్‌వేవ్‌కు ఇలా సిద్ధం కండి!

Union Ministry of Medical Health All the states Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే ముగుస్తున్న తరుణంలో.. మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు మరోసారి సూచనలిచ్చింది. రాష్ట్రాల్లో జిల్లా స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకూ అవసరమయ్యే మౌలిక వసతులను, వాటికయ్యే వ్యయం వంటి వాటిని సూచించింది. మొత్తంగా రూ. 8,261.45 కోట్లను కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ప్లాన్‌ కింద విడుదల చేస్తున్నట్టు చెప్పింది. రాష్ట్రాలు తమ వాటాగా 40 శాతం, కేంద్రం 60 శాతం వ్యయం భరిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా టెలీ కన్సల్టెన్సీ సేవలను భారీగా పెంచాలని, రోజుకు 5 లక్షల మందికి సేవలను అందించాలని సూచించింది.

ఏర్పాట్లపై కేంద్రం ఏం చెప్పిందంటే..?
► దేశవ్యాప్తంగా 8,800 ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌) అంబులెన్సులు ఏర్పాటు చేసుకోవాలి. వీటికి నెలకు రూ.2 లక్షల వరకూ చెల్లించాలి. 9 నెలల వరకు ఈ వాహనాలకు అయ్యే వ్యయం కేంద్రం చెల్లిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రాలు చెల్లించాలి. కోవిడ్‌ పేషెంట్లకే ఈ వాహనాలు ఉపయోగించాలి.
► అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,050 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంక్‌లకు అనుమతి ఇచ్చాం. ఒక్కో యూనిట్‌ వ్యయం రూ. 20 లక్షలు అవుతుంది. దీంతో పాటు ఎంజీపీఎస్‌ (మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ సిస్టం) కూడా రూ.60 లక్షల వ్యయంతో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.
► రోజుకు దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి ఇ–సంజీవని కింద ఔట్‌పేషెంటు సేవలు అందించాలి. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే చికిత్సకు వసతులు లేవో వారికి ఈ సేవలు అందించాలి. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ఇ–సంజీవని సేవలు జరుగుతున్నాయి.
► 540 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్‌లు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో యూనిట్‌లో 42 పడకలు ఉంటాయి. ఇందులో 12 పడకల ఐసీయూ యూనిట్‌ కూడా ఉంటుంది. మరో 196 జిల్లాల్లో 32 పడకల పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్‌లు ఉంటాయి. ఇక్కడ 8 పడకల ఐసీయూ వార్డు ఉంటుంది.
► దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్‌ ఐసొలేషన్‌ పడకలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 20 % కేవలం పీడియాట్రిక్‌ పడకలే ఉండాలి.
► ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6 పడకలు, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో 20 పడకలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలి. ఈ కేంద్రాల్లో టెలీ కన్సల్టేషన్‌ సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

సన్నద్ధతలో ఏపీ ముందంజ..
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లనూ చేసుకోవడం మొదలుపెట్టింది. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌ కోసం కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ప్లాన్‌లో భాగంగా ఏపీకి రూ. 696 కోట్ల మేర కేంద్రం అంచనా వేసింది. అందులో 60 శాతం కేంద్రం, 40 % రాష్ట్రం భరించనున్నాయి. రూ. 101.14 కోట్ల వ్యయంతో 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రుల్లో పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్లను ప్రారంభించనున్నారు. అలాగే రూ. 188.72 కోట్ల వ్యయంతో మరో 28 ఏరియా ఆస్పత్రుల్లో 40 లెక్కన 1,120 ఐసీయూ పడకలు శరవేగంగా ఏర్పాటవుతున్నాయి. రూ. 5 కోట్లతో గుంటూరు లేదా విజయవాడలో చిన్నపిల్లలకు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ప్రారంభిస్తారు. రూ. 185 కోట్ల ఖర్చుతో 1,145 పీహెచ్‌సీల్లో, 208 సీహెచ్‌సీల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నారు.

కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణలో భాగంగా 14 చోట్ల 50 పడకలు లేదా 100 పడకల ఫీల్డ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తారు. 100 పడకల ఆస్పత్రికి రూ. 7.5 కోట్లు, 50 పడకల ఆస్పత్రికి రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంది. రూ. 8.38 కోట్ల వ్యయంతో టెలీమెడిసిన్‌ను బలోపేతం చేస్తారు. ప్రతి ఆస్పత్రిలో అత్యవసర మందుల బఫర్‌ స్టాకు కోసం జిల్లాకు రూ.కోటి ఖర్చు చేయనుంది. కోటి ఆర్టీపీసీఆర్‌ టెస్టుల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తారు. కోవిడ్‌ సేవలకు గానూ 2,089 మంది పీజీ వైద్య విద్యార్థులు, 2,890 మంది ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారు, 1,750 మంది ఎంబీబీఎస్‌ చదువుతున్న వారు, 2వేల మంది నర్సింగ్‌ విద్యార్థులను 4 నెలల  ప్రతిపాదికన నియమిస్తారు. వీరికి వేతనాల కింద రూ.80.12 కోట్లు ఖర్చవుతుందని అంచనా.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top