
గెస్ట్ ఫ్యాకల్టీ, విద్యా వలంటీర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పేరుతో పోస్టింగ్‌లు
మంత్రి లోకేశ్‌తో ఉన్న టీడీపీ నాయకుడు నాయుడు ఫొటోలు వైరల్
కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటుగాళ్ళుగా మారిన పలువురు టీడీపీ నేతలు తమకు సచివాలయంలో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయంటూ, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. వారి మాయలో అధికారులు కూడా భాగస్వాములు అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ, వలంటీర్, తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామని సమగ్ర శిక్ష ద్వారా ఉద్యోగాల భర్తీని ఏజెన్సీకి అప్పగించారని టీడీపీ నాయకుడైన నల్లని నాయుడు, కర్నూలు రెడ్‌క్రాస్‌లో పని చేసే సుభాష్, కృష్ణమూర్తి అలియాస్ ఎం.త్రిమూర్తి రావు సాగించిన ఘరానా మోసాన్ని ఓ నిరుద్యోగి బట్టబయలు చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలతో పోస్టింగ్‌లు ఇచ్చినట్టు వెల్లడైంది. వీరి చేతిలో 40 మంది వరకు నిరుద్యోగులు మోసపోయినట్లు సమాచారం. బాధితురాలి కథనం మేరకు..
విద్యాశాఖ సెక్రటరీ ఆఫీస్ వద్ద డ్రామాతో..
గుంటూరులోని లక్ష్మీనగర్ 6వ లైన్ కొత్తపేటకు చెందిన పీఆర్ పింకీ అనే మహిళకు జూలై 1న ప్రైమరీ టీచర్‌గా అపాయింట్‌మెంట్ లెటర్ సృషించి ఇచ్చారు. ఈ లేఖ ఇచ్చేందుకు ముందుగానే కేటుగాళ్లు వారిని నమ్మించేందుకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ కార్యాలయం ఆవరణంలో పింకీ, ఆమె భర్తను కూర్చోబెట్టి 15 నిమిషాల్లోనే ఆర్డర్ సిద్ధమవుతుందని చెప్పి, అక్కడే కొంత డబ్బును బదిలీ చేయించుకున్నారు. అనంతరం కర్నూలులోని బి.క్యాంపు ప్రభుత్వ బాలికల హైసూ్కల్‌లో ప్రైమరీ టీచర్‌గా నకిలీ నియామక కాపీ ఇచ్చారు.
మళ్లీ ఆ స్కూల్‌లో ఖాళీలు లేవంటూ చివరిగా జొహరాపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో సోషల్ టీచర్‌గా చేర్పించారు. ఇందుకు ముందుగానే కృష్ణమూర్తి తాను అవుట్ సోర్సింగ్ ఏడీనని, ఆ స్కూల్‌లో ఒక టీచర్‌ను అపాయింట్ చేస్తున్నామని హెచ్‌ఎంకు చెప్పి.. రెండు రోజులకు పింకీతో కలిసి అపాయింట్‌మెంట్ లెటర్‌ను హెచ్‌ఎం మల్లేష్‌కు అందజేసి దానిపై హెచ్‌ఎంతో సంతకం, స్టాంప్ తీసుకున్నారు. కొద్ది రోజులు పని చేయించుకున్న హెచ్‌ఎం అనుమానంతో ఆర్డర్ కాపీ ఎంఈఓ ద్వారా తీసుకురావాలని చెప్పడంతో అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ కాపీలపై కర్నూలు డీఈఓ, సమగ్ర శిక్ష ఎక్స్ అఫీషియోగా చూపించి అక్కడ విజయవాడ పేరుతో ఉన్న స్టాంప్ వేయడం గమనార్హం.
విద్యాశాఖ నిర్లక్ష్యంతోనే నకిలీ నియామకం..
జొహరాపురం స్కూల్ హెచ్‌ఎం మల్లేష్ గత నెలలో తమ స్కూల్‌లో ప్రైమరీ టీచర్‌ని అంటూ ఓ మహిళ ఆర్డర్ కాపీ తీసుకొచ్చి చేరిందని ఏడీ దృష్టికి తీసుకెళ్లారు. అపాయింట్‌మెంట్ ఎవరు ఇచ్చారని, అదంతా నకిలీదని చెప్పడంతో హెచ్‌ఎం ఆ మహిళను స్కూల్‌కు రావొద్దని చెప్పి, ఆమె సంతకం చేసిన రిజిస్టర్‌ను చింపివేసినట్లు తెలుస్తోంది. సంతకం చేసిన విషయం గురించి ఎంఈఓ ప్రభావతికి ఏడీ ఖాన్ ఫోన్ చేసి అడగగా, తనకు సంబంధం లేదని, సంతకం తనది కాదని చెబుతుండడం గమనార్హం. ఈ విషయంపై డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్‌ను వివరణ కోరగా ఈ రోజే విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ నియామక పత్రాలు సృష్టించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.