మొక్కజొన్న గోడౌన్‌పై టీడీపీ గూండాల దాడి | TDP Goons Attack on Maize Godown | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న గోడౌన్‌పై టీడీపీ గూండాల దాడి

May 6 2026 5:58 AM | Updated on May 6 2026 5:58 AM

TDP Goons Attack on Maize Godown

ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతుల కుటుంబ సభ్యులు

రాడ్లతో గోడౌన్‌ తాళాలు పగులగొట్టి అరాచకం 

అడ్డొచ్చిన రైతులపై దౌర్జన్యం 

ధరలేక రైతులు దాచుకున్న మొక్కజొన్న నిల్వలపై హైడ్రామా 

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో ఘటన 

టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తీరుపై దుమ్మెత్తి పోసిన రైతులు

పొన్నూరు: మొక్కజొన్నకు ధర లేకపోవడంతో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో రైతులు పంట నిల్వ చేసుకున్న గోదాముపై టీడీపీ గూండాలు మంగళవారం దాడికి తెగబడ్డారు. ఇనుప రాడ్లతో గోడౌన్‌ షట్టర్‌ను పగులగొట్టి అడ్డొచ్చిన గోడౌన్‌ యజమాని సుదా సముద్రయ్యను దుర్భాషలాడుతూ అతడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్లే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఈ దుర్మార్గం చేయించారని దుమ్మెత్తి పోసిన రైతులు మొక్కజొన్నను మద్దతు ధరకు కొనిపించాల్సింది పోయి గోడౌన్‌పై దాడి చేయించడం ఏమిటని నిలదీశారు. 

టీడీపీ నేతల హైడ్రామా 
పొన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున మొక్కజొన్న సాగు చేశారు. ఈ పంటనంతా కొనిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ రైతులకు తక్కువ ధర చెల్లిస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మొక్కజొన్న రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ వారితో కలిసి వివిధ రూపాల్లో ఆందోళనలు జరిపారు. దీంతో టీడీపీ నేతలు కుట్రపన్ని మురళీకృష్ణ ఇంటికి సమీపంలోని గోడౌన్‌లో రైతులు దాచుకున్న మొక్కజొన్న నిల్వలన్నీ మురళీకృష్ణ కొనుగోలు చేసినవేనంటూ హైడ్రామాకు తెరతీశారు.

సుమారు 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గూండాలను వెంటబెట్టుకుని మంగళవారం మామిళ్లపల్లికి చేరుకుని గోడౌన్‌పై దాడి చేయడమే కాకుండా తాళాలు పగులగొట్టి పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. మొక్కజొన్న బస్తాలపై వైఎస్సార్‌సీపీ జెండాలను వేసి పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు చెందిన గోదాముగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకుల హంగామా చూసి పంటను గోడౌన్‌లో నిల్వ చేసుకున్న రైతులు అక్కడికి చేరుకోగా.. వారిపైనా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు.  టీడీపీ చర్యలపై రైతులతోపాటు గ్రామ ప్రజల నుంచి  విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా.. ఘటనపై బాధిత రైతులు పొన్నూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోను, తహశీల్దార్‌ కార్యాలయంలోను ఫిర్యాదు చేశారు. 

అద్దె తీసుకుంటున్నాం 
అంబటి మురళీకృష్ణపై నింద మోపాలనే ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ ప్రోత్సాహంతోనే టీడీపీ నాయ కులు ఈ అరాచకానికి పాల్పడ్డారు. 30 ఏళ్లు టీడీపీకి సేవలందించిన నాకు ఎమ్మెల్యే తగిన బుద్ధి చెప్పారు. మద్దతు ధర లేకపోవడంతో రైతులొచ్చి మా గోడౌన్‌లో మొక్కజొన్న నిల్వ చేసుకుంటామని అడిగారు. రైతుల కోరిక మేరకు బస్తాకు రూ.20 చొప్పున తీసుకొని నిల్వ చేస్తున్నాను. – సుదా సముద్రయ్య, గోదాము యజమాని, మామిళ్లపల్లి  

Advertisement
 
Advertisement
Advertisement