Ukraine conflict: The suffocation Of Indian Students Studying In Ukraine - Sakshi
Sakshi News home page

కంటి మీద కునుకు లేదు.. కడుపు నిండా తిండి లేదు 

Published Fri, Mar 4 2022 12:03 PM

The suffocation Of Indian Students Studying In Ukraine - Sakshi

ఒక వైపు రాకెట్ల దాడులు, మరో వైపు ఫిరంగుల మోతలు, బాంబుల శబ్ధాలు. అంతా భయానక వాతావరణం. ఎప్పుడు చల్లారుతుందో తెలియదు. ఉన్నత విద్య కోసం దేశం కాని దేశం వెళ్తే.. అకస్మాత్తుగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు మన విద్యార్థులను కష్టాల్లోకి నెట్టాయి. బతుకు జీవుడా అంటూ బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకోవాల్సిన దీనావస్థ తెచ్చిపెట్టాయి.

రష్యా భీకర దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న అనంతపురం జిల్లావాసులతో ‘సాక్షి’ గురువారం ఫోన్‌లో మాట్లాడింది. ‘కంటి మీద కునుకు లేదు.. కడుపు నిండా తిండి లేదు’ అని కొందరు భావోద్వేగంతో చెప్పగా, ‘ఎన్నో కష్టాలు పడి ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకున్నాం..  మరో రెండు రోజుల్లో మనం దేశం చేరుకుంటాం’ అని మరికొందరు వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 

ఎంతో కష్టంగా హంగేరి చేరుకున్నా
ఉక్రెయిన్‌లోని జెప్రోజీ స్టేట్‌ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ నాల్గో సంవత్సరం చదువుతున్నా. వ్యయప్రయాసలతో ప్రస్తుతం హంగేరికి చేరుకున్నా. మరో రెండు రోజుల్లో స్వగ్రామానికి  చేరుకుంటానని అనుకుంటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన లేదు.  
– సాయితేజ, బెళుగుప్ప  



 

బంకర్‌లో తలదాచుకున్నాం 
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నా. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపా. మేమున్న ప్రాంతంలో బాంబుల వర్షం కురవడంతో ఆ శబ్ధాలకు భయపడి బంకర్‌లోకి వెళ్లి దాక్కున్నా. నాతో పాటు ఏపీకి చెందిన మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ప్రాణభయంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక వాహనంలో రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్నాం. రైల్లో సుమారు 1,400 కి.మీ ప్రయాణించి ఉక్రెయిన్‌ బార్డర్‌ దాటాం. భారత ఎంబసీ అధికారులను కలిశాం. రెండు రోజుల్లో ఢిల్లీ చేరుకుంటాం.
–షేక్‌ షకుస్థా భాను, కదిరి 

నరకయాతన అనుభవించా..  
రెండు రోజుల క్రితం బుడాపెస్ట్‌ చేరుకున్నా. ఎంబసీ అధికారులు సౌకర్యాలు కల్పించారు. జాబితా ఆధారంగా ఇండియాకు పంపుతున్నారు. శుక్రవారం సాయంత్రంలోపు చేరే అవకాశం ఉంది. రెండు రోజుల నుంచి నరకయాతన అనుభవించా. హోటల్‌కు  వచ్చిన తరువాత   మనశ్శాంతి కలిగింది.     
– జి.శ్రావణి, గుమ్మఘట్ట 



బాంబుల మోతతో దద్దరిల్లుతోంది 

మేమున్న ప్రాంతం రోజూ పదుల సంఖ్యలో హెలికాప్టర్లు, విమానాల బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి. మేం మా కాలేజ్‌ కన్సల్టెంట్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో హంగేరి బార్డర్‌కు వచ్చాం. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి, భోజనం లభిస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియార్టీ ప్రకారం ప్రత్యేక ఫ్లైట్‌లలో పంపుతున్నారు. త్వరలోనే ఇంటికి వస్తాను.                                      
– అముక్తమాల్యద, కళ్యాణదుర్గం  
 

ఆహారానికి ఇబ్బంది పడుతున్నాం 
ఉక్రెయిన్‌ దేశంలోని చెర్నోవిట్సిలో బ్యూకో వెనియన్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నా. అష్టకష్టాలు పడి 3 రోజుల క్రితమే రుమేనియా సరిహద్దుకు చేరుకున్నా. ఇక్కడ ఒక భవనంలో నాతో పాటు మరికొందరిని ఉంచారు. ఆహారం, తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. రోజూ అమ్మానాన్నలతో ఫోన్‌లో మాట్లాడుతున్నా.              
– పవన్‌కల్యాణ్, మడకశిర  

 

ఒక్కో రూంలో 12 మంది బస 
ఉక్రెయిన్‌ యూనివర్సిటీ నుంచి బుధవారం సాయంత్రం బుడాపెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకున్నాం. షిప్టుల వారీగా టోకెన్లు అందజేస్తున్నారు. ఇంకా ఎప్పుడు పంపుతారో తెలియదు. ఒక్కో రూంలో 12 మంది బస చేస్తున్నాం. గురువారం మధ్యాహ్నం వరకూ ఆహారం ఇవ్వలేదు. ఆకలితో ఉన్నా.. క్షేమంగా ఉండడం సంతోషాన్నిస్తోంది. ఈ విషయాన్నే తల్లిదండ్రులకు తెలిపా. 
– అజిత్‌ రెడ్డి, ఉక్రెయిన్‌ వర్సిటీ విద్యార్థి, రాయదుర్గం  

ప్రస్తుతానికి సేఫ్‌ జోన్‌లోనే 
ఉక్రెయిన్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ప్రస్తుతం సేఫ్‌ జోన్‌ లోనే ఉన్నా. హంగేరి దేశంలోని బుడాపెస్ట్‌ ఎయిర్‌ పోర్టుకు 20 కి.మీ. దూరంలో ఉన్నా. బసతో పాటు ఇండియన్‌ ఎంబసీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. విడతల వారీగా ఇండియాకు పంపుతున్నారు. మరో  రెండు రోజుల్లో మన దేశం చేరుకుంటామని భావిస్తున్నా.  
– సాయి గణేష్, రాయదుర్గం

ఎప్పుడెళ్లేది క్లారిటీ లేదు
ఉక్రెయిన్‌ నుంచి ప్రత్యేక రైలులో హంగేరిలోని బుడాపెస్ట్‌కు చేరుకున్నా. ఇక్కడ    ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన ఆఫీస్‌లో ఉన్నా. సమయానికి భోజనాలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండియాకు ఎప్పుడు తీసుకెళ్లేది అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 
–  తిప్పేష్, మెడిసిన్‌ విద్యార్థి, కణేకల్లు  

రెండు రోజుల్లో గుంతకల్లుకు..
2019లో ఉక్రెయిన్‌లోని జాంబ్రేజాయా యూనివర్సీటీలో మెడిసిన్‌ అడ్మిషన్‌ పొందా.  గతేడాది ఆగస్టులో ఉక్రెయిన్‌ వెళ్లా. యుద్ధ వాతావరణంలో ఉండలేక జాంబ్రేజాయా నుంచి బస్సు, రైలు ప్రయాణం, నడక మార్గం ద్వారా మంగళవారం రాత్రికి హంగేరికి చేరా.  రెండు రోజుల్లో గుంతకల్లుకు చేరుకుంటా.   
– వి. సాయినాథ్, గుంతకల్లు  

Advertisement

తప్పక చదవండి

Advertisement