కడుపు మండిన కార్మికురాలి కన్నెర్ర | Sanitation workers Fires On CM Chandrababu | Sakshi
Sakshi News home page

కడుపు మండిన కార్మికురాలి కన్నెర్ర

May 6 2026 5:29 AM | Updated on May 6 2026 5:29 AM

Sanitation workers Fires On CM Chandrababu

జీతం ఇవ్వడం లేదని ఆక్రోశిస్తూ పంచాయతీ కార్యాలయానికి తాళం

గేటు ముందు బైఠాయించి  తీవ్ర నిరసన  

8 నెలలుగా వేతనం ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్న  

పారిశుధ్య కార్మికురాలికి అండగా నిలిచిన తోటి కార్మికులు

రేణిగుంట: కడుపు మండిన పారిశుధ్య కార్మికురాలు చంద్రబాబు సర్కారుపై కన్నెర్ర చేసింది. ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వడం లేదని ఆక్రోశిస్తూ ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసింది. గేటు ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఎనిమిది నెలలుగా జీతం లేకపోతే ఎలా బతకాలని నిలదీసింది. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్‌ పంచాయతీలో మంగళవారం జరిగింది. బాధితురాలికి తోటి కార్మికులు అండగా నిలిచారు. బాధితురాలి కథనం ప్రకారం..  రేణిగుంట మేజర్‌ పంచాయతీలో చంద్రకళ పారిశుధ్య కార్మికురాలిగా 20 ఏళ్లకుపైగా పనిచేస్తున్నారు.

అయితే ఆమెకు ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వడం లేదు. ఏఐటీయూసీలో కీలకంగా ఉంటూ కార్మికుల సమస్యలపై పోరాడినందుకే అధికారులు కక్షకట్టి తనకు జీతం ఆపేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. సాంకేతిక సాకులు చూపుతూ మానసికంగా వేధిస్తున్నారని వివరించారు. ఎనిమిది నెలలుగా జీతం లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నానని ఆవేదన చెందారు.

అందుకే పంచాయతీ సిబ్బందిని బయటకు పంపి గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసినట్టు వివరించారు. దీంతో ఈవో రమేష్‌ మంగళవారం సాయంత్రం కార్మికులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి డీపీవో కార్యాలయానికి పంపారు. ఇదిలా ఉంటే చంద్రకళకు మూడు బ్యాంకు ఖాతాలు ఉండడం వల్ల ట్రెజరీలో సాంకేతిక సమస్య వచ్చిందని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఆమె జీతాన్ని చెల్లిస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement